మళ్ళీ మొరాయించిన హైదరాబాద్‌ మెట్రో

January 24, 2023
img

హైదరాబాద్‌ మెట్రో రైళ్ళలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం నుంచి అమీర్ పేట్-రాయదుర్గం కారిడార్‌లో నిలిచిపోయాయి. దీంతో తాత్కాలికంగా రెండో వైపు అంటే రాయదుర్గం- అమీర్ పేట్ ట్రాక్ వైపు నుంచే ఇరువైపుల మెట్రో రైళ్ళని నడిపిస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

కాలేజీలు, ఆఫీసులు వదిలేవేళ ఒకవైపు మెట్రో రైళ్ళు నిలిచిపోవడంతో అమీర్ పేట్‌తో సహా పలు మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రస్తుతం నాంపల్లిలో నుమాయిష్‌ కూడా నడుస్తోంది. నగరం నలుమూలల నుంచి దానికి వేలమంది వెళుతుంటారు. వారిలో చాలామంది మెట్రోలోనే ప్రయాణిస్తుంటారు. 

మెట్రో ఇంజనీర్లు, సిబ్బంది సాంకేతిక సమస్యని పరిష్కరించడానికి ఇంకా ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ ఆలస్యం అయితే ప్రయాణికుల సంఖ్య క్షణక్షణానికి ఇంకా పెరిగిపోతుంటుంది కనుక మెట్రో రైళ్ళు ఆ ఒత్తిడి తట్టుకోవడం చాలా కష్టం. 

సోమవారం ఉదయమే ఎర్రమంజిల్ వద్ద సాంకేతికలోపం కారణంగా మెట్రో రైళ్ళు నిలిచిపోతే మెట్రో ఇంజనీర్లు, సిబ్బంది చాలా శ్రమపడి దానిని సరిచేశారు. మళ్ళీ ఈరోజు అదే సమస్యతో మెట్రో రైళ్ళు నిలిచిపోవడంతో మెట్రో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Related Post