హైదరాబాద్‌లో తుపాకీ కాల్పులు!

December 02, 2022
img

హైదరాబాద్‌లో అప్పుడప్పుడు తుపాకుల మోత వినిపిస్తూనే ఉంటుంది. ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ రంగంలోనే తుపాకుల మోత వినిపిస్తుండగా తొలిసారిగా బంగారం షాపు లూటీలో తుపాకులు మోత మోగింది. నాగోల్‌లోని స్నేహపూరి కాలనీలో గల మహదేవ్ జ్యూవెలరీ షాపులో నిన్న రాత్రి 7 గంటల ప్రాంతంలో ఇద్దరు దుండగులు కొనుగులుదారుల్లా ప్రవేశించి హటాత్తుగా షాపు యజమాని కళ్యాణ్ సింగ్‌కి తుపాకీ చూపించి బెదిరించి షాపులో బంగారం దోచుకుపోయారు. ఆ సమయంలో షాపు యజమాని బంగారు నగలు అప్పగించేందుకు వచ్చిన ఓ వ్యక్తి, షాపులో పనిచేస్తున్న సుక్‌రామ్ మాత్రమే ఉన్నారు. సుక్‌రామ్ దొంగలను అడ్డుకొనే ప్రయత్నం చేయగా వారు మూడు రౌండ్లు ఫైరింగ్ చేసారు. 

చుట్టుపక్కలవారు తుపాకీ కాల్పుల శబ్ధం విని అక్కడికి చేరుకొనేలోగా దోపిడీ దొంగలు బంగారంతో అక్కడి నుంచి బైక్‌పై పారిపోయారు. ఈ కాల్పులలో షాపు యజమాని కళ్యాణ్ సింగ్ త్యీవ్రంగా గాయపడగా సుక్‌రామ్ స్వల్పంగా గాయపడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చి వారిరువురిని స్థానిక సుప్రజా హాస్పిటల్‌లో చేర్చారు.  

వెంటనే చైతన్యపురి పోలీసులు అక్కడికి చేరుకొని సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేశారు. బహుశః వారు యూపీ, బిహార్‌, హర్యానా రాష్ట్రాలకు చెందిన గ్యాంగ్‌ అయ్యి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. షాపులో పడిన ఖాళీ తూటాలను బట్టి వారు నాటు తుపాకీని వినియోగించారని కనుగొన్నారు. బయట నుంచి ఓ వ్యక్తి బంగారం షాపు యజమాని బంగారు నగలు అప్పగించేందుకు వస్తున్నప్పుడే అతని వెనుకే దొంగలు కూడా షాపులోకి ప్రవేశించి షట్టర్ మూసేసి తుపాకీతో బెదిరించి ఆభరణాలు దోచుకుపోయారని పోలీసులు గుర్తించారు.

Related Post