హైదరాబాద్‌లో మరో గ్యాంగ్ రేప్.. అందరూ విద్యార్దులే!

November 29, 2022
img

హైదరాబాద్‌లో మరో గ్యాంగ్ రేప్ జరిగింది. హయత్ నగర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో పదో తరగతి విద్యార్ధిని ఆమె సాటి విద్యార్థులే ఐదుగురు సామూహిక అత్యాచారం చేశారు. అయితే నాలుగు నెలల క్రితం ఈ అత్యాచారం జరుగగా ఇప్పుడు బయటకి పొక్కింది. అత్యాచారం చేస్తున్నప్పుడు ఆ విద్యార్థులు వీడియో తీశారు. ఈ విషయం గురించి తల్లితండ్రులకు చెప్పినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టేస్తామని వారు ఆ బాలికని బెదిరించి మళ్ళీ మరోసారి ఆమెపై అత్యాచారం చేశారు. అయినా ఆమె భయపడి ఎవరికీ ఈ విషయం గురించి చెప్పలేదు. కానీ ఆమెపై అత్యాచారానికి పాల్పడిన విద్యార్థులలోనే ఒకరు ఆ వీడియో తోటి స్నేహితులకు పంపించడంతో ఈ విషయం బయటకి పొక్కి ఆమె తల్లితండ్రులకు కూడా తెలిసింది. వారు వెంటనే హయత్ నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, ఆ ఐదుగురు విద్యార్థులను జువైనల్ కోర్టులో హాజరుపరిచి జువైనల్ హోమ్‌కి తరలించారు. 

ఒకప్పుడు కరడుగట్టిన నేరస్తులే ఇటువంటి హేయమైన నేరాలు చేసేవారు. ఆ తర్వాత క్రమంగా ఈ జాడ్యం సమాజంలో సాధారణ వ్యక్తులకు కూడా వ్యాపించడంతో ఇటువంటి నేరాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పుడు పదో తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా ఇటువంటి హేయమైన నేరాలకు పాల్పడుతుండటం చాలా ఆందోళనకరమైన పరిస్థితే అని చెప్పవచ్చు.

Related Post