బెండాలపాడు నుంచి గుత్తికోయల బహిష్కరణ?

November 28, 2022
img

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చండ్రుగొండ మండలంలోని బెండాలపాడు గ్రామంలో అటవీశాఖ అధికారి శ్రీనివాసరావుని గుత్తికోయలు కత్తులతో దాడులుచేసి హత్య చేయడం, దాంతో వారిని అక్కడి నుంచి పంపించివేయాలని కోరుతూ అటవీశాఖ సిబ్బంది ధర్నాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. 

ఈ నేపధ్యంలో బెండాలపాడు గ్రామ కార్యదర్శి సతీష్, గ్రామ సర్పంచ్ కూసం వెంకటేశ్వర్లు, కొందరు స్థానిక ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఆదివారం గ్రామసభ జరిగింది. ఛత్తీస్‌ఘడ్‌ నుంచి వచ్చి తమ గ్రామంలో స్థిరపడిన 40 గుత్తికోయల కుటుంబాల వలన గ్రామంలో అందరికీ ఇబ్బందులు కలుగుతున్నాయని, ఇటీవల వారు అటవీశాఖ అధికారి శ్రీనివాసరావుని హత్య చేశారని కనుక 40 కుటుంబాలకు చెందిన 200 మంది గుత్తికోయలను గ్రామం నుంచి బహిష్కరిస్తూ గ్రామసభలో తీర్మానం చేశారు. దానిపై బెండాలపాడు గ్రామ కార్యదర్శి సతీష్, సర్పంచ్ కూసం వెంకటేశ్వర్లుతో సహా కొందరు గ్రామపెద్దలు కూడా సంతకాలు చేశారు. ఛత్తీస్‌ఘడ్‌ నుంచి వచ్చిన వారందరినీ ప్రభుత్వం వెనక్కు తిప్పి పంపించేయాలని అంతవరకు వారిని గ్రామంలో అడుగుపెట్టనీయరాదని తీర్మానం చేశారు.     

అయితే రాజ్యాంగం ప్రకారం ఇటువంటి గ్రామ బహిష్కరణలు నేరం గనుక గ్రామసభ తీర్మానం గురించి పైఅధికారులకు తెలియజేస్తామని చండ్రుగొండ మండలం రెవెన్యూ అధికారులు తెలిపారు. శాటిలైట్ చిత్రాల ఆధారంగా వారందరూ 2016లో ఛత్తీస్‌ఘడ్‌ నుంచి ఎర్రబోరు అటవీ ప్రాంతానికి వచ్చి స్థిరపడినట్లు గుర్తించామని అధికారులు చెపుతున్నారు. గుత్తి కోయలు నివాసం ఉంటున్న ఎర్రబోరు ప్రాంతం అంతా అటవీశాఖ పరిధిలోకి వస్తుంది కనుక వారందరినీ అక్కడి నుంచిఖాళీ చేసిపోవాలని నోటీసులు జారీ చేశామని రెవెన్యూ అధికారులు చెపుతున్నారు. అంటే వారిని అక్కడి నుంచి వెనక్కి పంపించేయడానికి చట్టప్రకారం కూడా చర్యలు చేపడుతున్నట్లు స్పష్టమవుతోంది. కనుక గ్రామ బహిష్కరణ అందుకు బీజంగా భావించవచ్చు. 

Related Post