మాకూ ఆయుధాలు ఇవ్వాల్సిందే... లేకుంటే డ్యూటీ చేయలేం!

November 23, 2022
img

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయల దాడిలో మరణించిన ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావు అంత్యక్రియలు నేడు ఆయన స్వగ్రామం ఈర్లపూడిలో అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్‌ స్వయంగా పాడె మోసి నివాళులు అర్పించారు. శ్రీనివాసరావు అంత్యక్రియలకు రాష్ట్రం నలుమూలల నుంచి అటవీశాఖ సిబ్బంది తరలివచ్చి నివాళులు అర్పించారు. అనంతరం వారు మంత్రులతో తమ సమస్యలను మొరపెట్టుకొన్నారు. 

గుత్తికోయలు తనను హత్య చేయాలని చూస్తున్నారని, వారి వలన తన ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని శ్రీనివాసరావు పలుమార్లు తమకు చెప్పారని, పై అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళినా ఎవరూ పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కనుక విధి నిర్వహణలో చనిపోయిన శ్రీనివాసరావుకి ప్రభుత్వం రూ.5కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. గుత్తికోయాల వలన తమ ప్రాణాలకు ఎప్పటికీ ప్రమాదం పొంచి ఉంది కనుక తమందరికీ కూడా తుపాకులు ఇవ్వాలని అటవీశాఖ సిబ్బంది డిమాండ్ చేశారు. 

దీనిపై ప్రభుత్వం రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని లేకుంటే గురువారం నుంచే విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. తమకు తుపాకులు ఇవ్వాలని ఎంతో కాలంగా అడుగుతున్నామని కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలననే శ్రీనివాసరావును కోల్పోవలసి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఇలాగే లాఠీలతో అడవులలో తిరిగాల్సివస్తే గిరిజనుల చేతిలో ఒకరొకరూ ఇలాగే ప్రాణాలు కోల్పోవలసి వస్తుందని కనుక ప్రాణం కంటే ఉద్యోగం ఎక్కువ కాదని వారు తేల్చి చెప్పారు. 

అటవీశాఖ సిబ్బంది డిమాండ్లపై మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్‌ స్పందిస్తూ, తుపాకుల గురించి సిఎం కేసీఆర్‌కి తెలియజేస్త్తామని చెప్పారు. దీనిపై సిఎం కేసీఆర్‌ మాత్రమే నిర్ణయం తీసుకోగలరు కనుక అంతవరకు ఓపిక పట్టాలని విజ్ఞప్తి చేశారు.        


Related Post