కొత్తగూడెంలో పోడు రైతుల దాడిలో ఫారెస్ట్ ఆఫీసర్ మృతి

November 22, 2022
img

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. పోడు రైతుల దాడిలో ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడి హాస్పిటల్‌కి తరలిస్తుండగా దారిలో కన్నుమూశారు. 

అటవీశాఖ అధికారులు శ్రీనివాసరావు, రామారావు ఎప్పటిలాగే మంగళవారం ఉదయం జిల్లాలో చంద్రుగొండా మండలంలో బెండాలపాడులో అటవీప్రాంతంలో గస్తీకి బయలుదేరారు. ఎర్రబోడు సమీపంలో పోడుభూములు సాగుచేసుకొనే కొందరు గుత్తికోయలు అటవీశాఖ నాటిని మొక్కలను పీకేస్తూ కనిపించారు. దాంతో వారిరువురూ పరుగున వెళ్ళి వారిని అడ్డుకోబోయారు. అయితే వారు తమ వద్ద ఉన్న కత్తులు, గొడ్డళ్ళతో అధికారులపై దాడి చేశారు. 

బెండాలపాడు సెక్షన్ అటవీ అధికారి రామారావు ఎలాగో తప్పించుకొని పారిపోయారు కానీ శ్రీనివాసరావు మాత్రం వారికి దొరికిపోయారు. గుత్తికోయాల దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరావును పోలీసులు అంబులెన్సులో చంద్రుగొండు ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ప్రాధమిక చికిత్స అందించి, ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా దారిలో చనిపోయారు. 

 ఈ ఘటనపై సిఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీనివాసరావు కుటుంబానికి రూ.50 లక్షల  ఎక్స్‌గ్రేషియా, పదవీ విరమణ వయసు వరకు ఆయన కుటుంబానికి పూర్తి వేతనాన్ని చెల్లించాలని ఆదేశించారు. ఆయన కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగ అర్హత ఉన్నట్లయితే కారుణ్య నియామకం కింద ఉద్యోగంలో నియమించాలని ఆదేశించారు.

శ్రీనివాసరావు అంత్యక్రియలు ప్రభుత్వ లాంచనాలతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ ఇద్దరినీ శ్రీనివాసరావు అంత్యక్రియలు, తదనంతరం వారి కుటుంబానికి ప్రభుత్వ సాయం అందించేందుకు తోడ్పడాలని సిఎం కేసీఆర్‌ ఆదేశించారు. శ్రీనివాసరావు మృతికి కారకులైన గుత్తికోయాల మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిజిపి మహేందర్ రెడ్డిని ఆదేశించారు. 

Related Post