అయోధ్యలో లతా మంగేష్కర్ చౌక్... 40 అడుగుల వీణ బొమ్మ ఏర్పాటు!

September 29, 2022
img

భారత రత్న అవార్డు గ్రహీత, ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ స్వర్గీయ లతా మంగేష్కర్ జయంతి సందర్బంగా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అయోధ్య నగరంలో సరయూ నది సమీపంలో ఓ ప్రధాన కూడలికి ఆమె పేరు పెట్టి గౌరవించింది. ఆ కూడలిలో 40 అడుగుల పొడవైన భారీ వీణ బొమ్మను కూడా ఏర్పాటు చేసింది. లతా మంగేష్కర్ 93వ జయంతి సందర్భంగా దానిని ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీ నుంచి వర్చువల్ పద్దతిలో ఆవిష్కరించారు. 

లతా మంగేష్కర్ కూడలిని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేసేందుకు యూపీ ప్రభుత్వం రూ.7.9 కోట్లు ఖర్చు చేసింది. ఆ వీణ బొమ్మపొడవు 40 అడుగులు, ఎత్తు సుమారు 38 అడుగులు, బరువు 14 టన్నులు. దానిపై లతా మంగేష్కర్ 62 పుట్టిన రోజులకు గుర్తుగా 92 కలువ పూవులను చెక్కించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అయోధ్య దేవలప్మెంట్ ఆధారిటీ కార్యదర్శి సత్యేంద్ర సింగ్, లతా మంగేష్కర్ సోదరి ఉషా మంగేష్కర్ ఇంకా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ లతా మంగేష్కర్‌ను తలుచుకొంటూ ఆమె పేరిట అయోధ్యలో ఓ కూడలికి పేరు పెట్టి వీణ బొమ్మను ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.   


Related Post