సింగరేణి కార్మికులకు దసరా బోనస్ 30 శాతం

September 28, 2022
img

సింగరేణి కార్మికులకు ఈ ఏడాది దసరా, దీపావళి పండుగల సందర్భంగా సంస్థ లాభాలలో 30 శాతం బోనస్ ఇవ్వాలని సిఎం కేసీఆర్‌ ఆదేశించారు. దసరా పండుగలోగా కార్మికులందరికీ బోనస్ చెల్లించాలని ఆదేశించారు. గత ఏడాది 29 శాతం బోనస్ ఇవ్వగా ఈ ఏడాది 30 శాతం ఇవ్వాలని సిఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు సిఎం కేసీఆర్‌ ప్రిన్సిపాల్ సెక్రెటరీ నర్సింగరావు... సింగరేణి ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్లకు ఈరోజు మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేశారు. ఈసారి సింగరేణి కార్మికులకు మొత్తం రూ.368 కోట్లు బోనస్‌గా సంస్థ చెల్లించబోతోంది. ఇదిగాక ఆనవాయితీ ప్రకారం సింగరేణి కార్మికులకు ఒక నెల జీతం పండగ అడ్వాన్స్ రూపంలో కూడా ఇస్తుంటుంది. కనుక అది కూడా ఇస్తుందో లేదో ఇంకా తెలియవలసి ఉంది. బోనస్, పండగ అడ్వాన్స్ కలిపి ఒక్కో కార్మికుడుకి సుమారు లక్ష రూపాయలు పైనే చేతికి అందుతుంటుంది. బోనస్ ప్రకటన వెలువడగానే సింగరేణి కార్మికులు సంబురాలు చేసుకొంటున్నారు. 

ఏడాది మొత్తం భూగర్భ, ఓపెన్ కాస్ట్ గనులలో దుమ్ముదూళిలో తమ ఆరోగ్యాన్ని, ప్రాణాలను పణంగా పెట్టి లక్షల టన్నుల బొగ్గును తవ్వితీసి  సింగరేణికి లాభాలు చేకూర్చిపెడుతుంటారు. వారు తవ్వి వెలికితీస్తున్న బొగ్గుతోనే రాష్ట్రంలో ధర్మల్ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలన్నీ నడుస్తూ రాష్ట్రంలో వెలుగులు నింపుతున్నాయి. కనుక చీకటి గనుల్లో పనిచేస్తూ రాష్ట్రంలో వెలుగులు నింపుతున్న సింగరేణి కార్మికులకు బోనస్ ఇవ్వడం వారి శ్రమకు, త్యాగాలకి గౌరవం ఇచ్చినట్లే భావించాల్సి ఉంటుంది.

Related Post