సూదిమందేసి నన్ను చంపేస్తారేమో?

September 23, 2022
img

ఇటీవల రాష్ట్రంలో వరుసగా రెండు సూదిమందు (ఇంజెక్షన్) హత్యలు జరగడంతో ఖమ్మం జిల్లాలో ప్రజలు ఇప్పుడు బస్సులు, ఆటోలలో ప్రయాణిస్తున్నప్పుడు తమ పక్కనే కూర్చోన్నవారిని అనుమానించే పరిస్థితులు నెలకొన్నాయని ఈ ఘటన తెలుపుతోంది. 

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని అజయ్ తండాకు చెందిన బానోత్ గోపి మండల కేంద్రంలో ప్రభుత్వం జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. రోజూ తండాలోని చెరువుమాదారం నుంచి ఆటోలలో కళాశాలకు వెళ్ళి వస్తుంటాడు. ఎప్పటిలాగే నిన్న కూడా ఓ ఆటో ఎక్కాడు. ఆ ఆటోలో చేతి సంచీతో ఓ వ్యక్తి, అతని పక్కనే నిద్రిస్తున్న ఓ బాలుడు ఉన్నారు. 

ఆటో బయలుదేరిన తర్వాత ఆ వ్యక్తి ఆటోడ్రైవరుతో మాట కలుపుతూ ఇటీవల జరిగిన సూదిమందు హత్యల గురించి మాట్లాడసాగాడు. డ్రైవర్ కూడా వాటి గురించి తన అభిప్రాయాలు చెపుతున్నాడు. వారిరువురి మాటలు శ్రద్దగా వింటున్న బానోత్ గోపి తన పక్కనే నిద్రిస్తున్న బాలుడిని చూశాడు. వారు సూదిమందు ఇవ్వడం వలననే ఆ పిల్లాడు స్పృహకోల్పోయాడేమో అనే అనుమానం కలిగింది.

దాంతో వారిరువురూ తనను కూడా సూదిమందుతో హత్య చేస్తారేమో అని గోపీ భయపడ్డాడు. గోపీ భయపడిపోతూ ఆటోని ఆపమని డ్రైవరుని కోరాడు. కానీ అతను ‘నీ కాలేజీ రాలేదు కదా అప్పుడే ఎందుకు తొందర?’ అంటూ ఆటోని ఆపకుండా నడిపిస్తున్నాడు. డ్రైవర్ మాటకి తన పక్కనే కూర్చోన్న వ్యక్తి కూడా నవ్వుతూ సంచీలో చేయి పెడుతుండటం చూసి గోపీ ఇంకా భయపడిపోయాడు. సంచీలో నుంచి సూదిమందు తీసి తనను పొడిచేస్తాడనే భయంతో వేగంగా నడుస్తున్న ఆటోలో నుంచి దూకేశాడు. 

దాంతో గోపీ కాళ్ళు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. గోపీ హటాత్తుగా దూకేయడంటో ఆటో పక్కకు పడిపోయి దానిలో ఉన్న వ్యక్తికి, ఆటో డ్రైవరుకి స్వల్ప గాయాలయ్యాయి. ఆ తర్వాత వారు తేరుకొని ఆటోని లేపి వెళ్ళిపోయారు. 

ఒంటి నిండా దెబ్బలతో భయంతో గజగజ వణికిపోతూ గోపీ తండాకు చేరుకొని జరిగిన విషయం కుటుంబ సభ్యులకు చెప్పగా వారు గ్రామస్తులను వెంటబెట్టుకొని ఘటనా స్థలానికి చేరుకొన్నారు. కానీ అక్కడ ఆటో కనిపించకపోవడంటో వారు పోలీసులకు ఫిర్యాదు చేసి గోపీని హాస్పిటల్‌లో చేర్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆటో డ్రైవర్, ఆ వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

Related Post