జరిమానా కట్టలేదా అయితే దానికీ జరిమానా

September 22, 2022
img

అసలుకి వడ్డీ... మళ్ళీ వడ్డీకి చక్రవడ్డీ అన్నట్లు హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిబందనలు ఉల్లంఘించినందుకు జరిమానాలు చెల్లించవలసినవారు వాటిని సకాలంలో చెల్లించకపోతే మళ్ళీ అందుకు వేరేగా జరిమానా విధిస్తున్నారు నగరంలోని ట్రాఫిక్ పోలీసులు. 

ముందుగా గత మూడు నెలల్లో జరిమానాలు చెల్లించనివారిపై ట్రాఫిక్ పోలీసులు దృష్టి పెడుతున్నారు. హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసినందుకు రూ.100 జరిమానా విధిస్తున్న సంగతి తెలిసిందే. అది చెల్లించకుండా పట్టుబడితే రెండోసారి రూ.200, మూడోసారి రూ.600 జరిమానా వసూలు చేస్తారు. ఎప్పటికప్పుడు జరిమానాలు చెల్లిస్తే రూ.100 చొప్పున జరిమానా చెల్లిస్తే సరిపోతుంది. 

మోటారు వాహనాల చట్ట ప్రకారం ట్రాఫిక్ నిబందనలు ఉల్లంఘించినందుకు విధించిన జరిమానాను సకాలంలో చెల్లించకపోతే ఆ చట్టాన్ని ధిక్కరించినట్లే. దీనికి కనీస జరిమానా రూ.500 చొప్పున విధించవచ్చు. కానీ హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు ఇంతవరకు దీనిని అమలుచేయలేదు. కానీ ఇకపై దీని ప్రకారం జరిమానాలు దశలవారీగా పెంచాలని నిర్ణయించారు. 

ఇకపై రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే ద్విచక్ర వాహనాలకు, ఆటో రిక్షాలకు విధించిన జరిమానాలు చెల్లించకపోతే పట్టుబడిన ప్రతీసారి రూ.200,600,800 చొప్పున వరుసగా పెంచుతూ జరిమానాలు వసూలు చేయబోతున్నారు. అదే.. తేలికపాటి, భారీ వాహనాలకైతే రూ.1000,1500,2000 చొప్పున వసూలు చేయబోతున్నారు. 

ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేస్తున్న ద్విచక్ర వాహనాలకు, ఆటో రిక్షాలకు రూ.200,700,1000 చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అదే.. వాహనాలను పోలీస్ స్టేషన్‌లకు తరలించి ఉంటే వాటికి కనీస మొత్తం రూ.350 నుంచి జరిమానాలు మొదలవుతాయి. తేలికపాటి, భారీ వాహనాలకైతే రూ.1000,1200,1700 చొప్పున వసూలు చేయబోతున్నారు. 

కనుక హైదరాబాద్‌లో వాహనాలు నడుపుతున్నవారు మరింత జాగ్రత్తగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపడం మంచిది. లేకుంటే  పెట్రోల్, డీజిల్, ట్రాఫిక్ జరిమానాలకు వారి సంపాదన సరిపోదు.

Related Post