హైదరాబాద్‌లో మళ్ళీ ఈడీ సోదాలు

September 20, 2022
img

గత మూడు వారాలలో మూడుసార్లు ఈడీ అధికారులు హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించారు. మళ్ళీ నిన్న మరోసారి సోదాలు నిర్వహించారు. ఈసారి బంజారా హిల్స్‌లో నివశిస్తున్న కరీంనగర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వెన్నమనేని శ్రీనివాసరావు, టిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల ఉప్పల్‌లో ప్రారంభోత్సవం చేసిన శాలిగ్రామ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో, మాదాపూర్‌లోని వరుణ్ సన్స్ సంస్థలో, బంజారాహిల్స్‌లోని జానా ట్రావెల్స్ ఏజన్సీలలో సోమవారం సోదాలు నిర్వహించాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు జరిపినట్లు తెలుస్తోంది. సోదాలు ముగిసిన తర్వాత ఈడీ అధికారులు వెన్నమనేని శ్రీనివాసరావును అదుపులోకి తీసుకొని సుమారు ఆరు గంటలసేపు ప్రశ్నించారు. 

శ్రీనివాసరావుకి రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు పలు వ్యాపారాలలో భాగస్వామిగా ఉండటం లేదా పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ప్రధాన నిందితులు రామచంద్రన్ పిళ్ళై, అభిషేక్ రావు, గండ్ర ప్రేమసాగర్ రావులతో జరిపిన ఆర్ధికలావాదేవీలు, ఈ కుంభకోణంలో హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయడం, వాటి ఛార్జీల చెల్లింపుల గురించి ఈడీ అధికారులు శ్రీనివాసరావుని ప్రశ్నించి సమాధానాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఆయన వద్ద నుంచి రాబట్టిన సమాచారంతో త్వరలో మరి కొంతమందికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. 

Related Post