టీఎస్‌ఆర్టీసీ పంద్రాగస్టు కానుకలు

August 09, 2022
img

భారత్‌ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృతోత్సవ్‌ పేరిట ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసి సజ్జనార్‌, ఆజాదీ కా అమృతోత్సవ్‌లో భాగంగా రాష్ట్ర ప్రజలకు కొన్ని కానుకలు ప్రకటించారు.   

• ఈ ఆగస్ట్ 15వ తేదీన రాష్ట్రంలో జన్మించిన పిల్లలందరికీ 12 ఏళ్ళు వయసు వచ్చే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఆర్టీసీ బస్సులోనైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. 

• ఈ ఆగస్ట్ 15న రూ.120లకు లభించే టి-24 బస్ పాసు రూ.75లకే లభిస్తుంది. 

• ఈ ఆగస్ట్ 15న టీఎస్‌ఆర్టీసీ కార్గో సర్వీసులో ఒక కిలో పార్సిల్ 75 కిమీల లోపు ఉచితంగా రవాణా చేయబడుతుంది. 

• ఈ ఆగస్ట్ 15న పుష్పక్ సర్వీసులలో శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్ళే ప్రయాణికులకు 25 శాతం రాయితీ. 

• ఈ ఆగస్ట్ 15న 75 ఏళ్ళు నిండిన వృద్ధులందరికీ రాష్ట్రంలో ఏ ఆర్టీసీ బస్సులోనైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. 

• ఈ ఆగస్ట్ 15 నుంచి 22వరకు 75 సం.లు దాటిన సీనియర్ సిటిజన్లకు తార్నాకలోని టీఎస్‌ఆర్టీసీ హాస్పిటల్‌లో పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు. 75 సం.ల లోపు వారికి కేవలం రూ.750 లకే వైద్య పరీక్షలు చేయబడతాయి. 

• ఆగస్ట్ 16 నుంచి 21వరకు టీఎస్‌ఆర్టీసీ టీటీడీ ప్యాకేజీలో రూ.75 తగ్గింపు. 

ఆజాదీ కా అమృతోత్సవ్‌ వేడుకలలో భాగంగా ఈ నెల 10వ తేదీ నుంచి ఆగస్ట్ 21వరకు 12 రోజుల పాటు టీఎస్‌ఆర్టీసీ అనేక కార్యక్రమాలు నిర్వహించబోతోంది. నేటి నుంచి ఆగస్ట్ 15వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోలు బస్టాండ్లు, ఆర్టీసీ హాస్పిటల్స్, తదితర అన్ని చోట్ల ప్రతీరోజు ఉదయం 11 గంటలకు జాతీయగీతాన్ని ఆలపిస్తారు. ఆగస్ట్ 13 నుంచి 15వరకు అన్ని ఆర్టీసీ బస్సులపై జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేస్తారు. టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు అందరూ ఆజాదీ కా అమృతోత్సవ్‌ బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారు.

Related Post