బాసర ట్రిపుల్ ఐ‌టి వంటగదిలో సిబ్బంది స్నానాలు!

August 06, 2022
img

బాసర ట్రిపుల్ ఐ‌టిలో గత కొన్ని నెలలుగా వార్తలలో నిలుస్తోంది. ఇటీవలే ఫుడ్ పాయిజనింగ్‌ అవడంతో 20 మంది విద్యార్థులకు ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో విషయం బయటపడింది. ట్రిపుల్ ఐ‌టిలో 600 మంది విద్యార్థులకు భోజన సదుపాయం సమకూర్చే కేంద్రీయ భండార్ మెస్‌లో సిబ్బంది, వంట సామాగ్రి పక్కనే స్నానాలు చేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. 

ఫుడ్ పాయిజనింగ్ కేసుపై ఓ పక్క దర్యాప్తు జరుగుతుండగానే మెస్‌లో సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం విస్మయం కలిగిస్తుంది. సిబ్బంది తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెస్ కాంట్రాక్టరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం వలననే సిబ్బంది కూడా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, తాము యూనివర్సిటీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అధికారులు చెపుతున్న మాటలకు వాస్తవ పరిస్థితులకి ఎక్కడా పొంతన లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.  

ఫుడ్ పాయిజనింగ్‌ కేసులో కేంద్రీయ భండార్, ఎస్‌ఎస్‌ మెస్‌ కాంట్రాక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ కమీషన్లకు అలవాటుపడిన యూనివర్సిటీ అధికారులు వారిని తొలగించకుండా నేటికీ వారితోనే మెస్ నిర్వహిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈసారి తమ తల్లితండ్రులు కూడా వచ్చి ఆందోళన చేసినప్పటికీ యూనివర్సిటీ అధికారులలో, మెస్‌ కాంట్రాక్టర్లు, సిబ్బందిలో ఎటువంటి మార్పు కలగలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. 

Related Post