రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొత్త ట్రెండ్: కాల్పులు, హత్యలు

August 05, 2022
img

తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో రాష్ట్రంలో భూముల ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. కనుక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్రవేశించి నాలుగు కాసులు వెనకేసుకొందామనే తాపత్రయంతో కొంతమంది ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకొంటూ సైడ్ బిజినెస్‌గా బ్రోకరేజి చేస్తున్నారు. అయితే అదే వారి ప్రాణాల మీదకు తెస్తోంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు పోటీ పెరిగిపోవడంతో ప్రత్యర్ధులను తప్పించేందుకు కిడ్నాపులు, కాల్పులు, హత్యలకు కూడా వెనకాడటం లేదు. ఇటువంటి ఘటనే నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని సింగారం గ్రామంలో జరిగింది. 

జిల్లాలోని నార్కాట్ పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామానికి చెందిన నిమ్మల లింగస్వామి మునుగోడులో కూల్ డ్రింక్స్, నీళ్ళ బాటిల్స్ అమ్ముకొని జీవనం సాగిస్తుంటాడు. సైడ్ బిజినెస్‌గా రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా చేస్తుంటాడు. అతను రోజూలాగే గురువారం రాత్రి దుకాణం కట్టేసి ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వెళుతుండగా దారిలో సింగారం గ్రామ శివారులో ఇద్దరు దుండగులు ద్విచక్ర వాహనంపై వచ్చి తుపాకీతో మూడు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు.

ఈ సమాచారం అందుకొన్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని అపస్మారక స్థితిలో ఉన్న లింగస్వామిని నార్కట్ పల్లిలోని కామినేని హాస్పిటల్‌కు తరలించారు. సకాలంలో తీసుకురావడంతో వైద్యులు అతని ప్రాణాలు కాపాడగలిగారు. ప్రస్తుతం లింగస్వామి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని లింగస్వామి చెప్పిన వివరాల ఆధారంగా కాల్పులు జరిపిన వ్యక్తులను కోసం గాలింపు మొదలుపెట్టారు.

Related Post