సిద్ధిపేటలో 128 మంది విద్యార్దులకు అస్వస్థత

June 27, 2022
img

సిద్ధిపేటలోని ప్రభుత్వ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో నిన్న మధ్యాహ్నం కలుషిత ఆహారం తిని 128 బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం మధ్యాహ్నం వండిన చికెన్ కర్రీల్లో మిగిలిన గ్రేవీని ఆరోజు రాత్రి వండిన వంకాయ కూరతో కలిపి వడ్డించారు. అది తిన్న బాలికలు వెంటనే వాంతులు చేసుకొన్నారు. ఆదివారం రాత్రి బాలికలు అస్వస్థతకు గురవగా సోమవారం ఉదయం పాఠశాల నిర్వాహకులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తెలియజేశారు. వైద్యులు, సిబ్బంది వెంటనే పాఠశాలకు చేరుకొని విద్యార్దులకు అక్కడే చికిత్స అందించారు. ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. 

ఏకంగా 128 మంది విద్యార్ధినులు అస్వస్థతకు గురవడంపై మైనర్ గురుకులాల రాష్ట్ర సహాయ కార్యదర్శి యూసఫ్ ఆలీ, జిల్లా విజిలెన్స్ అధికారి గౌస్ పాషా, మైనార్టీ గురుకులాల జిల్లా ఇన్‌ఛార్జ్ గోపాలరావు తదితరులు ఈరోజు ఉదయం సిద్ధిపేటలోని గురుకుల పాఠశాలకు చేరుకొని విచారణ జరిపారు. పరీక్ష కోసం కలుషిత కూర శాంపిల్ సేకరించి ల్యాబ్‌కు పంపారు. ఈ ఘటనలో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకొంటామని చెప్పారు.

Related Post