జూబ్లీహిల్స్‌ గ్యాంగ్ రేప్ కేసులో నిందితుల నిర్ధారణ పూర్తి

June 27, 2022
img

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్‌ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో బాధితురాలైన మైనర్ బాలిక ఈరోజు న్యాయమూర్తి సమక్షంలో నిందితులను గుర్తించే ప్రక్రియ పూర్తయింది. జూబ్లీహిల్స్‌ పోలీసులు ముందుగా మైనర్ బాలికను చంచల్‌గూడ జైలుకి తీసుకువెళ్ళి అక్కడ ఉన్న ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌ను న్యాయమూర్తి సమక్షంలో గుర్తింపజేశారు. తరువాత వారందరూ జువైనల్ హోమ్‌కు వెళ్ళి అక్కడ ఉంటున్న మైనర్ నిందితులని గుర్తించే ప్రక్రియను పూర్తి చేశారు. దీంతో వారే ఈ హేయమైన నేరానికి పాల్పడినట్లు దృవీకరించడమైంది. 

అయినప్పటికీ ఈ కేసులో నిందితులందరూ చాలా పలుకుబడి కలిగిన రాజకీయ నాయకుల పిల్లలు కనుక వారు ఎటువంటి పరిస్థితులు ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి వీలులేకుండా నాంపల్లి కోర్టు అనుమతితో పోలీసులు వారందరికీ, మైనర్ బాలికకు కూడా డీఎన్ఏ పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఈ అత్యాచారం జరిగిన ఇన్నోవాకారులో క్లూస్ టీం సేకరించిన ఆధారాలతో ఈ డీఎన్ఏ ఫలితాలను సరిపోల్చి వారే అత్యాచారం చేశారని శాస్త్రీయమైన ఆధారాలతో నిరూపించేందుకు ఇది చాలా అవసరం. ఒకటి రెండు రోజులలో నిందితులు, మైనర్ బాలిక డీఎన్ఏలను సేకరించి పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తారు. 

ఈ ప్రక్రియ అంతా పూర్తయి అన్ని సాక్ష్యాధారాలు సిద్దమైన తరువాత పోలీసులు నిందితుల మీద నేరారోపణ చేస్తూ కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఇక అక్కడి నుంచి ఈ కేసు కోర్టు పరిధిలోకి వెళ్లిపోతుంది. కానీ ఈ కేసుల విచారణ ఎన్నేళ్ళు సాగుతుందో.. చివరికి వారికి చట్ట ప్రకారం కటిన శిక్షలు పడతాయో లేదో ఎవరికీ తెలియదు. కానీ ఈ లోగా నిందితుల తల్లితండ్రులు ఏదో విదంగా బెయిల్‌పై వారిని బయటకు తెచ్చుకొనేందుకు గట్టి ప్రయత్నాలు చేయడం తధ్యం. భారత్‌లో ఏదైనా సాధ్యమే కనుక వారి ప్రయత్నాలు ఫలిస్తే నిందితులు అందరూ బెయిల్‌పై విడుదలయినా ఆశ్చర్యపోనక్కరలేదు.

Related Post