దత్తత వ్యవహారంపై కరాటే కళ్యాణి ఏమన్నారంటే..

May 17, 2022
img

రెండు నెలల పాప దత్తత వ్యవహారంపై నటి కరాటే కళ్యాణి వివాదంలో చిక్కుకొన్న సంగతి తెలిసిందే. ఈరోజు ఆమె తన లాయర్ రామచంద్రరావుతో కలిసి హైదరాబాద్‌ కలెక్టర్‌ను కలిసి ఈ వివాదం గురించి వివరించారు. 

అనంతరం ఆమె, తన న్యాయవాదితో కలిసి మీడియాతో మాట్లాడుతూ, “నేను పాపను దత్తత తీసుకోలేదు. పాప తల్లితండ్రులు నిరుపేదలు. వారు మా ఇంటికి సమీపంలోనే ఉంటుండటంతో వారికి నేను ఆర్ధికసాయం అందిస్తున్నాను. ఆ పరిచయంతో వారు తమ పాపను నా దగ్గర వదిలి వెళుతుంటారు. నాకు పిల్లలంటే చాలా ఇష్టం కనుక పాపను చేరదీసి లాలిస్తుంటాను తప్ప దత్తత తీసుకోలేదు. పాపను నేను పెంచుకోవడం లేదు. కానీ ఎవరో ఆకాశరామన్న నేను పసిపిల్లలను అక్రమంగా కొనుగోలు చేసి అమ్ముతున్నానని ఫిర్యాదు చేయడంతో చైల్డ్ లైన్ అధికారులు నా ఇంటికి వచ్చి సోదాలు చేశారు. 

అందుకే నేను కలెక్టర్‌ను కలిసి జరిగిందంతా వివరించాను. రేపు చైల్డ్ లైన్ కార్యాలయానికి కూడా వెళ్ళి అధికారులకు వివరణ ఇస్తాను. నాపై మీడియా, అధికార టిఆర్ఎస్‌ పార్టీతో సహా కొందరు కుట్రలు చేస్తున్నారు. కనుక ఆ ఛానల్స్ ప్రతినిధులతో నేను మాట్లాడదలచుకోలేదు. ఓ నిరుపేద కుటుంబానికి నేను సాయపడుతున్నాననే మంచి విషయం నలుగురికీ తెలియాలని ఒక మీడియా మిత్రుడు సూచిస్తేనే ఈ విషయం బయటకు వచ్చింది తప్ప లేకుంటే అసలు దీని గురించి చెప్పుకోవడానికి, మాట్లాడుకోవడానికి ఏమీ లేదు,” అని కరాటే కళ్యాణి అన్నారు. 

ఆమెకు లాయర్ రామచంద్రరావు చాలా చక్కగా మార్గదర్శనం చేశారని అర్ధమవుతోంది. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “కళ్యాణి గారు ఈ పాపను దత్తత తీసుకొంటేనే అది చట్టబద్దమా కాదా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. కానీ అసలు ఆమె దత్తత తీసుకోనప్పుడు ఇక ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు కదా?ఇదే విషయం రేపు చైల్డ్ లైన్ అధికారులకు కూడా చెప్పి ఈ కేస్ క్లోజ్ చేసేస్తాం,” అని అన్నారు. 

Related Post