నేను ఎక్కడికి పారిపోలేదు: కరాటే కళ్యాణి

May 17, 2022
img

తెలుగు సినీ నటి కరాటే కళ్యాణి అనుమతి లేకుండా పసిపిల్లలను దత్తత తీసుకొని పెంచుతోందంటూ శిశు సంక్షేమ శాఖకు ఫిర్యాదు రావడంతో మొన్న ఆదివారం ఉదయం అధికారులు ఆమె ఇంటికి వెళ్ళారు. కానీ వారు వస్తున్న విషయం ఆమెకు ముందే ఎలా తెలిసిందో కానీ ఆరోజు నుంచే ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆమెతో పాటు రెండు నెలల ఆడ శిశువును కూడా తీసుకువెళ్ళారు. 

ఆమెను సోమవారం హైదరాబాద్‌లోని తమ కార్యాలయానికి శిశువుతో సహా హాజరుకావాలని ఆమె తల్లి విజయలక్ష్మికి అధికారులు చెప్పారు. కానీ నేటికీ ఆమె హాజరు కకపోవడంతో శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆమె పేర ఓ నోటీస్ జారీ చేశారు. ఆమె ఎక్కడ ఉన్నా తక్షణం తమ ముందు శిశువుతో సహా హాజరై వివరణ ఇవ్వాలని లేకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవలసి ఉంటుందని నోటీసు ద్వారా హెచ్చరించారు. 

అయితే శిశుసంక్షేమ శాఖ అధికారుల నోటీసుకు స్పందించని కరాటే కళ్యాణి తాను హైదరాబాద్‌ విడిచి పారిపోయానని సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై వెంటనే స్పందించడం విశేషం. 

“నేను ఎక్కడికి పారిపోలేదు. నేను ఎటువంటి తప్పు చేయలేదు. కనుక ఎవరికీ భయపడి పారిపోవలసిన అవసరం నాకు లేదు. అయినా నేను ఎవరికో భయపడి పారిపోయే రకం కాదు. నేను నా ఫోన్‌ స్విఛాఫ్ చేయలేదు. ఫోన్‌ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోవడంతో స్విఛాఫ్ అయిపోయింది. త్వరలో పూర్తి సాక్ష్యాధారాలతో మీ ముందుకు వచ్చి నా నిర్ధోషిత్వాన్ని నిరూపించుకొంటాను. నాకు పసి పిల్లలంటే చాలా ఇష్టం. అందుకే అనాధ పిల్లలను అక్కున చేర్చుకొని కాపాడుతుంటాను. అది కూడా తప్పేనా? పసిపిల్లలను సినిమా వాళ్ళకు సప్లై చేయడానికే నేను వారిని చేరదీస్తున్నానని నాపై పనిగట్టుకొని దుష్ప్రచారం చేసేవాళ్ళకు త్వరలోనే సరైన సమాధానం చెపుతాను,” అంటూ కరాటే కల్యాణి ఓ సందేశం మీడియాకు పంపించారు.

Related Post