కరాటే కళ్యాణి ఇంట్లో చైల్డ్ లైన్ విజిలెన్స్ సోదాలు

May 16, 2022
img

తెలుగు సినీ నటి కరాటే కళ్యాణి ఇంట్లో ఆదివారం చైల్డ్ లైన్ విజిలెన్స్ సోదాలు నిర్వహించారు. ఆమె అక్రమంగా చిన్న పిల్లలను దత్తత పేరుతో కొనుగోలు చేసి పిల్లలు లేనివారికి అమ్ముతూ వ్యాపారం చేస్తోందంటూ ఓ వ్యక్తి చైల్డ్ లైన్‌కు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేశాడు. వెంటనే చైల్డ్ లైన్ విజిలెన్స్ అధికారులు మహేశ్, సంతోష్ ఎస్ఆర్‌ నగర్ పోలీసులను వెంటబెట్టుకొని హైదరాబాద్‌ రాజీవ్ నగర్‌లోని లక్ష్మీ నిలయంలోని ఆమె నివాసానికి వెళ్ళి సోదాలు చేశారు. కానీ ఆ సమయంలో కరాటే కళ్యాణి ఇంట్లో లేరు. ఆమె ఇంట్లో ఎవరూ పిల్లలు కూడా లేరు. 

ఇంట్లో ఉన్న ఆమె తల్లి విజయలక్ష్మిని విజిలెన్స్ అధికారులు ప్రశ్నించగా, తన కూతురికి చిన్న పిల్లలు, ఆనాధ పిల్లలను చేరదీసి ఆశ్రయం కల్పిస్తుంది తప్ప ఎటువంటి వ్యాపారం చేయదని చెప్పారు. ఇటీవలే శ్రీకాకుళం నుంచి వచ్చిన ఓ కుటుంబం తన కూతురు పేద పిల్లలను చేరదీస్తుందని తెలుసుకొన్న 33 రోజులు వయసున్న ఆడ శిశువును అప్పగించి వెళ్ళారని విజయలక్ష్మి చెప్పారు. విజిలెన్స్ అధికారులు వచ్చే ముందే తన కూతురు ఆ శిశువును ఆస్పత్రికి తీసుకు వెళ్ళిందని విజయలక్ష్మి చెప్పారు. కరాటే కళ్యాణికి ఫోన్‌ చేయగా ఆమె ఫోన్‌ ఎత్తకపోవడంతో మళ్ళీ సోమవారం వస్తామని చెప్పి విజిలెన్స్ అధికారులు వెళ్ళిపోయారు. 


నాలుగు రోజుల క్రితమే కరాటే కళ్యాణి మహిళలను కించపరుస్తూ ఫ్రాంక్ వీడియో తీస్తున్నడంటూ ఎస్ఆర్‌ నగర్‌లో నివశిస్తున్న శ్రీకాంత్ రెడ్డి అనే యువకుడుపై దాడి చేసి చితకబాదిన సంగతి తెలిసిందే. బహుశః అతనే ఆమెపై ఈ ఫిర్యాదు చేసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ కరాటే కళ్యాణి చిన్నారులను దత్తత పేరిట కొనుగోలు చేసి పిల్లలు లేనివారికి అమ్ముతుండటం నిజమే అయితే ఆమె పెద్ద చిక్కులో పడినట్లే.   

Related Post