హుజూరాబాద్‌లో హృదయ విదారక ఘటన

May 14, 2022
img

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ పట్టణంలో శుక్రవారం హృదయ విదారకరమైన ఓ ప్రమాదం జరిగింది. పట్టణంలో ఆర్టీసీ డిపో వద్ద కాలువ నిర్మాణ పనులు చేస్తున్న మౌటం రాజు (36) అనే కార్మికుడు ప్రమాదవశాత్తూ కిందన పడినప్పుడు కాలువ గోడ నిర్మాణం కోసం అమర్చిన ఇనుపరాడ్డు ఒకటి అతని దవడలో దిగబడింది. అది అతని దవడలో నుంచి గుచ్చుకొని తలలోకి పైకి రావడంతో అతను బాధతో విలవిలలాడిపోయాడు. అది చూసి చుట్టూ ఉన్నవారు అతనిని ఏవిదంగా కాపాడలో తెలియక వెంటనే 108 అంబులెన్సుకి ఫోన్‌ చేశారు. తలలో నుంచి దూసుకుపోయిన ఆ ఇనుపరాడ్డును పట్టుకొని వ్రేలాడుతూ రాజు సుమారు గంటసేపు నరకయాతన అనుభవించాడు. 

108 అంబులెన్సు సిబ్బంది వచ్చి అతి కష్టం మీద అతని దవడ కింద ఇనుప రాడ్డును కట్ చేసి స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. కానీ అక్కడ వైద్యులు దానిని బయటకు తీసే సాహసం చేయలేకపోవడంతో ప్రాధమిక చికిత్స చేసి వరంగల్‌ ఎంజీఎం హాస్పిటల్‌కు పంపించారు. అక్కడ వైద్యులు సుమారు రెండు గంటల సేపు శస్త్ర చికిత్స చేసి రాజు తలలో గుచ్చుకొన్న ఆ రాడ్డును బయటకు తీశారు. కానీ అది తీసిన కొద్ది సేపటికే అతను చనిపోయాడు.  

Related Post