నిజామాబాద్‌ పీజీ మెడికో శ్వేత మృతికి కారణాలు ఏమిటో?

May 14, 2022
img

నిజామాబాద్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో పీజీ చేస్తున్న శ్వేత (27) గురువారం రాత్రి అనుమానస్పద స్థితిలో చనిపోయింది. 

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం...కరీంనగర్‌ జిల్లా కేంద్రం శివారులో గల తిమ్మాపూర్‌లో నివశిస్తున్న గుర్రం శ్రీనివాస్, కవిత దంపతుల కుమార్తె శ్వేత. ఆమె చెలిమెడ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి 2020లో నిజామాబాద్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో చేరి పీజీ చేస్తోంది. చనిపోయిరోజు రాత్రి ఆమె ప్రసూతీ వార్డులో విధులు నిర్వహిస్తోంది. 

ఆరోజు రాత్రి 11.30 గంటల వరకు డ్యూటీ చేసిన తరువాత ఆమె తోటి మహిళా హౌస్ సర్జన్లతో కలిసి పక్కనే ఉన్న గదిలో పడుకొన్నారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు శ్వేత ఓ ఆపరేషన్ చేయవలసి ఉండటంతో ఆమె ఒక్కరే అక్కడ పడుకొని ఉండగా మిగిలినవారు తెల్లవారుజామున ఇళ్ళకు వెళ్ళిపోయారు. ఉదయం 6గంటలకు డ్యూటీకి వచ్చిన నర్సు మంచం మీద పడుకొని ఉన్న శ్వేతను నిద్రలేపేందుకు ప్రయత్నించగా ఆమె చనిపోయినట్లు గుర్తించి వెంటనే ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రతిమారాజ్‌కు తెలియజేశారు. ఆమె వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.  

డాక్టర్‌ ప్రతిమారాజ్‌ నిన్న మీడియాతో మాట్లాడుతూ, శ్వేతకు ఇదివరకు రెండుసార్లు కరోనా వచ్చిందని తెలిపారు. బహుశః ఆమె నిద్రలో గుండెపోటు వచ్చి చనిపోయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. 

ఈ విషయం తెలుసుకొన్న శ్వేత తల్లితండ్రులు నిజామాబాద్‌  చేరుకొని హాస్పిటల్‌లో చనిపోయున్న కూతురుని చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శ్వేతకు ఇటీవలే ఓ పెళ్లి సంబందం ఖాయం ఆవడంతో త్వరలో నిశ్చితార్దం జరుగనుంది. చక్కగా ఉన్నత చదువులు చదువుకొని మంచి ఉద్యోగంలో చేరి పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడుతుందనుకొంటున్న సమయంలో హటాత్తుగా కుమార్తె చనిపోవడం చూసి శ్వేత తల్లితండ్రులు షాక్ అయ్యారు. ఝార్ఖండ్‌లో ఐపీఎస్ శిక్షణ పొందుతున్న ఆమె సోదరుడు రవి కూడా నిజామాబాద్‌ చేరుకొని సీపీ నాగరాజుతో మాట్లాడారు. 

గురువారం రాత్రి వరకు ఆరోగ్యంగా ఉన్న శ్వేత తెల్లారేసరికి హాస్పిటల్‌ విశ్రాంతి గదిలో ఒంటరిగా ఉన్న సమయంలో మృతి చెందడంపై తమకు అనుమానాలు ఉన్నాయని, కనుక ఆమె మృతిపై లోతుగా దర్యాప్తు జరపాలని రవి పోలీస్ కమీషనర్‌ను కోరారు.       

పోలీసులు కేసు నమోదు చేసుకొని శ్వేత మృతదేహాన్ని అదే ఆస్పత్రిలో నేడు పోస్టుమార్టం చేయించబోతున్నారు. ఆ నివేదిక వస్తే గానీ శ్వేత ఎలా చనిపోయిందనే విషయం తెలియదు. 

Related Post