హైదరాబాద్‌లో పెరిగిన పచ్చదనం..ఎరిక్ అభినందనలు

January 21, 2022
img

తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న హరితహారం కార్యక్రమం వలన రాష్ట్రంలో పచ్చదనం పెరిగింది. హైదరాబాద్‌ నగరంలో 2011 నుంచి 2021 వరకు 4,866 హెక్టార్లలో పచ్చదనం పెరిగిందని ప్రపంచ పర్యావరణ వేత్త ఎరిక్ సోలీహిమ్ ట్విట్టర్‌ ద్వారా తెలియజేస్తూ ‘వెల్ డన్ హైదరాబాద్‌, తెలంగాణ, ఇండియా...’ అంటూ అభినందనలు తెలిపారు.  



రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమం అమలుచేయడం మొదలుపెట్టినప్పటి నుంచి 2021 వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 63,200 హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు పెరిగాయి. గత రెండేళ్ళలో దేశవ్యాప్తంగా 2,261 చదరపు కిమీ మేర అడవులు పెరుగగా వాటిలో 632 చదరపు కిమీ తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి. అంటే దేశంలో మిగిలిన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 1,629 చదరపు కిమీ మేర అడవులు పెరిగితే, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 632 చదరపు కిమీ మేర పెరిగాయన్న మాట! పచ్చదనం కలిగిన మెట్రో నగరాలలో గతంలో బెంగళూరు మొదటి స్థానంలో నిలుస్తుండేది. ఇప్పుడు హైదరాబాద్‌ నగరం అగ్రస్థానంలో నిలుస్తోంది. 

ఏటా వర్షాకాలం ప్రారంభం అవగానే హరితహారం కార్యక్రమం ద్వారా అన్ని జిల్లాలలో కోట్లాది మొక్కలు నాటుతున్నారు. అలాగే నగరాలు, పెద్ద పట్టణాలలో అర్బన్ ఫారెస్ట్ పేరిట పార్కులను ఏర్పాటు చేస్తున్నారు. కేవలం మనుషులకు మాత్రమే కాక కోతులు, జింకలు, పక్షులు తదితర మూగజీవాలకు ఆహారం, ఆశ్రయం అందించేందుకు వాటికి తగిన చెట్లతో కూడిన అడవులను కూడా తెలంగాణ రాష్ట్రంలో పెంచుతుండటం మరో విశేషం. 

Related Post