పూరీ వైపు కదులుతున్న జవాద్

December 04, 2021
img

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి శుక్రవారం మధ్యాహ్నానికి తుఫానుగా మారింది. దీనికి జవాద్ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఇది విశాఖకు ఆగ్నేయంగా 280 కిమీ దూరంలో, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కి 400 కిమీలు,  పూరీకి 460 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. మొదట ఇది గోపాల్‌పూర్‌ వద్ద తీరం దాటుతుందని వాతావరణ శాఖ  అంచనా వేసింది కానీ అది కొద్దిగా దిశ మార్చుకొని ఇప్పుడు ఒడిశాలోని పూరీ వైపు కదులుతోంది. ఆదివారం మధ్యాహ్నం పూరీ వద్ద తీరం దాటి పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంవైపు కదులుతూ క్రమంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.    

ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ నగరాలపై జావద్ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మూడు జిల్లాలలో బలమైన ఈదురు గాలులతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రస్తుతం విశాఖ తీరం వెంబడి గంటకు 14-20 కిమీ వేగంతో గాలులు వీస్తున్నాయి. జావద్ తుఫాను తీరం సమీపిస్తున్న కొద్దీ తీరం వెంబడి గంటకు 80-90 కిమీ వేగంతో గాలులు వీస్తాయని, శనివారం మధ్యాహ్నానికి ఈ తీవ్రత పెరిగి గంటకు 110 కిమీ వేగంతో గాలులు వీస్తాయని కనుక ప్రజలు, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. 

జావద్ తుఫాను ప్రభావంతో ఇప్పటికే మూడు ఉత్తరాంద్ర జిల్లాలలో ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. విశాఖ తీరంలో సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. విశాఖ జిల్లా అధికారులు ముందు జాగ్రత్త చర్యగా విశాఖ నుంచి భీమిలి వరకు సముద్రతీరం వెంబడి గల అన్ని పార్కులను, బీచ్‌లను, పర్యాటక ప్రాంతాలను మూసివేశారు. జాలార్లను సముద్రంలో చేపల వేటకు వెళ్ళకుండా అడ్డుకొన్నారు. ఒడిశాలోని గోపాల్‌పూర్‌, పూరీలతో సహా ఏపీలోని మూడు జిల్లాలలో అధికారులు అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు, ఏర్పాట్లు చేసుకొని సిద్దంగా ఉన్నారు. 

Related Post