హైదరాబాద్‌తో సహా 14 జిల్లాలకు రెడ్‌ అలర్ట్

September 28, 2021
img

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేడు, రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపధ్యంలో హైదరాబాద్‌ నగరంతో సహా రాష్ట్రంలో 14 జిల్లాలలో వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలో కామారెడ్డి, సిద్ధిపేట, వరంగల్‌, హన్మకొండ, రాజన్న సిరిసిల్లా, పెద్దపల్లి, కరీంనగర్‌, జనగామ, జగిత్యాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌, నిర్మల్, నిజామాబాద్‌ జిల్లాలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కనుక ప్రజలు, జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

రాష్ట్రంలో నిన్న అత్యధికంగా రాజన్న సిరిసిల్లా జిల్లాలోని మర్రిగడ్డలో 18.2 సెంటీ మీటర్లు, జైశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాలలో 17.2 సెంటీ మీటర్లు, అత్యల్పంగా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో 10.18 సెంటీ మీటర్లు వర్షపాతం నమోదైంది. 

నిజామాబాద్‌ జిల్లాలో సిరికొండలో 16.6, కరీంనగర్‌ జిల్లాలోని వీణవంకలో 15.5, రంగారెడ్డి జిల్లా మంఖాల్‌లో 12.1 సెంటీ మీటర్లు వర్షపాతం నమోదైంది. 

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో  అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ళలో నుంచి బయటకు రావద్దని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.

Related Post