తెలంగాణలో నేడు రేపు భారీ వర్షాలు

September 28, 2021
img

గులాబ్ తుఫాను బలహీనపడి వాయుగుండంగా మారినప్పటికీ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేడు, రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు బంగాళాఖాతంలో సోమవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడిన కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నట్లు తెలిపింది. ఏటా ఈ సీజనులు అత్యధికంగా 70.72 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదయ్యేదని కానీ ఈసారి 35 శాతం ఎక్కువగా అంటే 95.70 శాతం వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ తెలిపింది.    

గులాబ్ తుఫాను ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు జిల్లాలలో చెరువులు, కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. పంటలు నీట మునిగాయి. హైదరాబాద్‌ నగరమైతే ఎటు చూసినా రోడ్లపై నీళ్ళు ప్రవహిస్తుండటంతో పెద్ద చెరువును తలపిస్తోంది. ఈసారి కూడా గత ఏడాదిలాగే నగరంలో నాలాలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలుకాలనీలలో రోడ్లపై నీళ్ళు ప్రవహిస్తుండటంతో ప్రజలు ఇళ్ళలో నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. లోతట్టు ప్రాంతాలలో ఇళ్ళలోకి నీళ్ళు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

జీహెచ్‌ఎంసీ, పోలీస్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది హైదరాబాద్‌ నగరంలో సహాయ చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ ఎప్పటికప్పుడు వివిద శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో సమావేశమవుతూ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు.

Related Post