మరియమ్మ లాకప్ డెత్ కేసు విచారణ వచ్చే నెలకు వాయిదా

August 02, 2021
img

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మరియమ్మ లాకప్ డెత్ కేసుపై నేడు హైకోర్టు విచారణ చేపట్టినప్పుడు చేసిన వ్యాఖ్యలు చాలా ఆలోచింపజేస్తాయి. ప్రభుత్వం తరపున వాదిస్తున్న అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్, “ఈ కేసులో మరియమ్మకు ప్రభుత్వం పూర్తి న్యాయం చేసిందని వివరిస్తూ, ఆమె కుటుంబానికి ఆర్ధికసాయం, ఆమె కుమారుడికి ప్రభుత్వోద్యోగం ఇచ్చిందని, ఈ కేసులో నిందితులైన ఎస్సై వి.మహేశ్వర్, కానిస్టేబుల్స్ ఎంఏ రషీద్, పి.జానయ్యలను విధులలో నుంచి తొలగించామని చెప్పారు. అయితే వీటన్నిటితో పోయిన ప్రాణం తిరిగి తెప్పించలేము కదా? ఇటువంటి ఘటనలు మళ్ళీ జరుగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి సూచించారు. ఈ కేసులో పునర్విచారణ చేస్తున్న ఆలేరు మేజిస్ట్రేట్ తన నివేదికను సమర్పించిన తరువాత తదుపరి విచారణ చేపడతామని చెపుతూ ఈ కేసును సెప్టెంబర్ 15కి వాయిదా వేశారు. 

ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో కోమట్లగూదేనికి చెందిన మరియమ్మ తాను పనిచేస్తున్న ఇంట్లో రూ.2 లక్షలు దొంగతనం చేసిందనే ఫిర్యాదు రావడంతో, జూన్‌ 18వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లాలోని అడ్డగూడూరు పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు ఆమెను తమ శైలిలో విచారణ జరపడంతో స్పృహకోల్పోయింది. దాంతో వారు స్థానిక ఆర్‌ఎంపీ వైద్యుడికి చూపించారు. కానీ అప్పటికే ఆమె పరిస్థితి విషమించడంతో వైద్యుని సూచన మేరకు భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే మరియమ్మ చనిపోయింది.

Related Post