కౌశిక్ రెడ్డికి ఉజ్వల భవిష్యత్‌ ఉంది: కేసీఆర్‌

July 21, 2021
img

ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడిన కౌశిక్ రెడ్డి ఇవాళ్ళ ప్రగతి భవన్‌లో సిఎం కేసీఆర్‌ సమక్షంలో టిఆర్ఎస్‌ పార్టీలో చేరారు. ఆయనతోపాటు వందలాదిమంది కాంగ్రెస్‌ కార్యకర్తలు కూడా టిఆర్ఎస్‌లో చేరారు. సిఎం కేసీఆర్‌ వారందరికీ సాధారంగా పార్టీలోకి ఆహ్వానం పలుకుతూ సుదీర్గంగా ప్రసంగించారు. 

గతంలో సాయినాథ్ రెడ్డిగారు, నేను కలిసి పనిచేశాము. ఇప్పుడు ఆయన కుమారుడు కౌశిక్ రెడ్డి, ఆయన అనుచరులు రాష్ట్రాభివృద్ధిలో పాలుపంచుకొనేందుకు మా పార్టీలో చేరుతుండటం నాకు చాలా సంతోషం కలిగిస్తోంది. మీ అందరికీ పార్టీలోకి సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. కౌశిక్ రెడ్డికి టిఆర్ఎస్‌లో మంచి భవిష్యత్‌ ఉంటుంది,” అని అన్నారు.  

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, తదనంతర రాజకీయ పరిణామాల గురించి మాట్లాడుతూ, “ఆనాడు ఉద్యమ సమయంలో నన్ను, నా పోరాటాలను చివరికి నా ముక్కు, శరీరాకృతిని కూడా చాలా మంది అవహేళన చేశారు కానీ నేను అవన్నీ పట్టించుకోకుండా పొరాడి చివరికి తెలంగాణ రాష్ట్రం సాధిచుకొన్నాను. ఆనాడు నన్ను అవహేళన చేసినవారే కళ్ళారా అది చూశారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా మేమేదైనా పధకం ప్రకటిస్తే దానినీ విమర్శించేవారు కోకొల్లలున్నారు. ఇవన్నీ కబుర్లే తప్ప అమలయ్యే పధకాలు కావంటూ ఎద్దేవా చేస్తున్నారు. కానీ రైతు బంధుతో సహా ప్రతీ పధకం నూటికి నూరుశాతం అమలవుతుంటే ఏమి చేయాలో పాలుపోక నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కానీ ప్రతీ పధకం వెనుక ఎంతో మేధోమధనం ఉంది. ఆ తరువాతే పధకాలను అమలుచేస్తున్నాము. అందుకే అవి విజయవంతం అవుతున్నాయి. అందుకు ఉదాహరణగా గొర్రెల పంపిణీ పధకం గురించి చెప్పుకోవచ్చు. నేడు దేశంలో అత్యధికంగా పశుసంపద కలిగి, మాంసం ఎగుమతి చేయగలిగిన ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రమే, “ అని అన్నారు. 

దళిత బంధు పధకం గురించి మాట్లాడుతూ, “కొత్తగా ప్రవేశపెడుతున్న దళిత బంధు పధకం గురించి కూడా ప్రతిపక్ష నేతలు అలాగే అవాకులు చావాకులు వాగుతున్నారు. ఇది ఎన్నికల కోసమే పెట్టిన పధకం అని దుష్ప్రచారం చేస్తున్నారు. మనం ఏ కులంలో పుట్టాలనేది మన చేతుల్లో లేదు. కనుక ఎవరు ఏ కులంలో పుట్టినా అందరం మనుషులమనే భావనతో కలిసిమెలిసి మెలగాలి.. అందరూ చిర్నవ్వుతో ఒకరినొకరు ప్రేమాభిమానాలతో పలకరించుకొనే విధంగా సమాజం ఉండాలని నేను కోరుకొంటున్నాను. మన పొరుగింట్లో ఒకరు బాధలు పడుతుంటే మనం సంతోషంగా ఉండలేము. ఇదీ అంతే. ఇప్పటికే వివిద కులాలకు, వర్గాలకు తగిన సంక్షేమ పధకాలు ప్రకటించి విజయవంతంగా అమలుచేస్తున్నాము. ఇప్పుడు దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు పధకం ప్రవేశపెట్టాము తప్ప ఎన్నికల కోసం కాదు,” అని సిఎం కేసీఆర్‌ అన్నారు.

Related Post