హైదరాబాద్‌లో మెట్రో నియో ప్రాజెక్టుకు గ్రీన్‌ సిగ్నల్‌

July 21, 2021
img

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ నగరంలో ఎన్ని హైవేలు, రవాణా వ్యవస్థలు ఉన్నప్పటికీ సరిపోవడం లేదు. కనుక మెట్రో రైళ్ళకు పొడిగింపుగా మెట్రో నియో అనే పేరుతో సరికొత్త రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మెట్రో నియో పేరుకు రైల్ వ్యవస్థవంటిదే అయినా దీనిలో రెండు లేదా మూడు ఎలక్ట్రిక్ బస్సులను కలిపి నడిపిస్తారు. కనుక ఈ ప్రాజెక్టు కోసం భారీ ఖర్చుతో కూడిన భూసేకరణ, రైల్వేలైన్ నిర్మాణాలు అవసరం ఉండవు. కేవలం విద్యుత్ సరఫరా కోసం లైన్లు వేస్తే సరిపోతుంది. కనుక మెట్రో రైల్‌ వ్యవస్థ కంటే 40 శాతం తక్కువ వ్యయంతోనే దీనిని ఏర్పాటు చేసుకోవచ్చు. 

హైదరాబాద్‌ మెట్రో రైల్‌, యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీలు కలిసి నగరంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఓ నివేదికను సమర్పించాయి. దాని ప్రకారం మియాపూర్ వరకు మెట్రో రైల్ సర్వీసులు అందుబాటులో ఉన్నందున అక్కడి నుంచి కేపీహెచ్‌బీ కాలనీ, మాదాపూర్‌, హైటెక్‌సిటీ, కొండాపూర్‌, గచ్చిబౌలి మీదుగా కోకాపేట ఔటర్‌రింగ్‌ రోడ్డు వరకు 24 కిమీ పొడవునా మెట్రో నియోను అందుబాటులోకి తీసుకువస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కనుక ఈ ఏడాది డిసెంబర్‌లోగా ఈ మెట్రో నియో ప్రాజెక్టు పనులు ప్రారంభం కావచ్చు.

Related Post