ఫోన్‌ మాట్లాడుతూ ఒకేసారి రెండు డోసుల వాక్సిన్

June 19, 2021
img

మానవ తప్పిదాలతో నిత్యం ఎన్నో ప్రాణాలు పోతున్నా ఎక్కడో అక్కడ పొరపాట్లు పునరావృతం అవుతూనే ఉంటాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్‌ జెడ్పీ హెల్త్ సెంటరులోని కరోనా టీకా కేంద్రంలో పనిచేస్తున్న పద్మ అనే ఓ నర్స్ మొబైల్ ఫోన్‌లో మాట్లాడుకొంటూ లక్ష్మీ ప్రసన్న అనే యువతికి ఒకదాని తరువాత ఒకటి రెండు డోసుల టీకాలు వేసేసింది. దాంతో ఆ యువతి స్పృహ తప్పి పడిపోయింది. అక్కడే ఉన్న సిబ్బంది ఆమెను వెంటనే వనస్థలిపురంలోని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో ఆమె కొలుకొంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 

చాలా మందికి కరోనా సోకకుండా ఉండేందుకు వాక్సిన్ వేసుకొంటున్నామని తెలుసు కానీ అది ఏ వాక్సిన్, ఎంత డోస్ ఇస్తారు వంటి వివరాలు తెలియవు. అది వారి తప్పు కాదు. కానీ శిక్షణ పొందిన నర్సులు, సిబ్బందికి వ్యాక్సిన్లు, డోసేజీల గురించి పూర్తి అవగాహన ఉంటుంది. కనుక ఇటువంటి ఘోరమైన పొరపాట్లు చేయడం బాధ్యతారాహిత్యమే అవుతుంది. నర్స్ చేసిన పొరపాటుకి ఆ యువతి ప్రాణం కోల్పోయి ఉంటే ఏమైఉండేది? కనుక ఇక నైనా ఇటువంటి పొరపాట్లు పునరావృతం కాకుండా వ్యాక్సిన్‌ కేంద్రాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

Related Post