వర్షాకాలం వచ్చేస్తోంది...ధాన్యం వగైరా కాపాడుకోండి ఇలా

June 10, 2021
img

ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాలలో వర్షాలు పడుతున్నాయి. త్వరలో వర్షాకాలం మొదలైతే నిత్యం వానలు కురుస్తాయి. ఈ వర్షాలు దుక్కి దున్ని నాట్లు వేసేందుకు చాలా ఉపకరించవచ్చు కానీ చేతికి వచ్చిన పంటలు ఇంకా అమ్ముడుకాని రైతుల పాలిట శాపంగా మారుతాయి. పండిన పంటలను దాచుకొనేందుకు గోదాములు లేని రైతులు పడుతున్న అవస్థలను గమనించిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కొన్ని రోజుల క్రితమే కేవలం రూ.500 కంటే తక్కువ ఖర్చుతో వరి, మిర్చి లేదా మరేదైనా పంటలను కాపాడుకొనేందుకు ఓ కొత్త పద్దతిని ప్రదర్శించి చూపారు. 

రైతులు ముందుగా చేతికి వచ్చిన తమ పంటను బస్తాలలో నింపుకోవాలి. నేలపై టార్పాలిన్ పరవాలి. ఒకవేళ టార్పాలిన్ కొనలేకపోతే నేలపై 4-5 అంగుళాలు ఎత్తువరకు ఇటుకలు, చెక్కలు లేదా మారేవైనా పేర్చాలి. దానిపై బస్తాలు పేర్చాలి. మళ్ళీ వాటిపై పిరమిడ్ ఆకారంలో 25-35 బస్తాల వరకు పేర్చాలి. ఆ తరువాత కిందన టార్పాలిన్ పరిచి ఉంటే దానిని అంచులను పైకి మడతపెట్టాలి. 

ఆ తరువాత మార్కెట్లో లభించే ప్లాస్టిక్ షీట్లతో ఆ బస్తాలను పైనుంచి కింద వరకు మద్యలో ఎక్కడా నీళ్ళు కారకుండా పూర్తిగా కప్పాలి. అవసరమైతే మార్కెట్లో లభించే మాస్కింగ్ టేప్‌తో ఆ ప్లాస్టిక్ కవరును బిగించాలి. అంతే! ఎంత వర్షం కురిసినా ధాన్యం బస్తాలు తడిసిపోవు. ఈ బస్తాలు నిలువ చేసిన చోట నీళ్ళు నిలిచిపోకుండా జాగ్రత్తపడాల్సి ఉంటుంది. 

దీనికి రూ.500 కంటే తక్కువే ఖర్చు అవుతుంది. రైతులు అప్పులు తెచ్చి ఎంతో కష్టపడి పండించిన పంటను అమ్ముకొనేవరకు భద్రంగా కాపాడుకోవడానికి ఇంతకంటే సులువైన మార్గం లేదు కనుక ప్రయత్నిస్తే మంచిది. రైతుల కష్టాలను గమనించి వారి కోసం ఇటువంటి ఉపాయం ఆలోచించి చూపినందుకు కొండా విశ్వేశ్వర్ రెడ్డికి అభినందనలు. 


Related Post