గంగులకు ఈటల రాజేందర్‌ వార్నింగ్

May 18, 2021
img

ఈటల రాజేందర్‌ టిఆర్ఎస్‌లో ఉన్నప్పుడే మంత్రి గంగుల కమలాకర్‌తో విభేధాలు ఉండేవి. అవిప్పుడు పతాకస్థాయికి చేరుకొన్నాయి. ఈటలను మంత్రివర్గంలో నుంచి బయటకు పంపించిన తరువాత గంగుల కమలాకర్‌ కరీంనగర్‌లో కూర్చొని హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ఈటల మద్దతుదారులను ఆయన నుంచి వేరుచేసి టిఆర్ఎస్‌వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తుండటంతో వారిద్దరి మద్య ప్రత్యక్ష యుద్ధం మొదలైంది. 

నిన్న హుజూరాబాద్‌కు వచ్చిన ఈటల రాజేందర్‌ మంత్రి గంగుల కమలాకర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి వార్నింగ్ ఇచ్చారు. ఈటల రాజేందర్‌ మీడియాతో మాట్లాడుతూ, “కరీంనగర్‌ ప్రజలు నీకు ఓటేసి గెలిపించింది హుజూరాబాద్‌ ప్రజలను వేదించడానికి కాదు. నాపై రాజకీయ కక్ష సాధించదలచుకొంటే చేసుకోవచ్చు కానీ నా ప్రజలను మాత్రం వేదించొద్దు. రాజకీయాలలో ఎవరికీ అధికారం శాస్వితం కాదనే సంగతి గుర్తుంచుకొంటే మంచిది. 2023 ఎన్నికల తరువాత నీకు ఈ పదవీ, అధికారమూ రెండూ ఉండవు. నువ్వు చేస్తున్న బ్లాక్ మెయిల్ రాజకీయాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. హుజూరాబాద్‌ ప్రజలతో గత రెండు దశాబ్ధాలుగా నాకు బలమైన అనుబందం ఉంది. మాది తల్లీ బిడ్డల అనుబందం. కనుక నా నుంచి ప్రజలను ఎవరూ వేరు చేయలేరు. ఇప్పుడపుడే హుజూర్‌నగర్‌  నియోజకవర్గంలో ఉపఎన్నికలు జరిగే పరిస్థితులు లేవు. ఎప్పుడు జరిగినా నాగార్జునసాగర్ ఉపఎన్నికలలోలాగా ఇక్కడ మీ పప్పులు ఉడకవని గుర్తుంచుకొంటే మంచిది. ఎప్పుడు ఉపఎన్నికలు జరిగినా ప్రజలు, ఉద్యమకారులు అందరూ నా వెంటే ఉంటారు. కనుక పదవీ అధికారం చూసుకొని విర్రవీగవద్దని హెచ్చరిస్తున్నాను. ఇకనైనా ఈ బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోకుంటే హుజూరాబాద్‌ కేంద్రంగా ఉద్యమం ప్రారంభిస్తాను,” అంటూ ఈటల రాజేందర్‌ తీవ్ర స్వరంతో హెచ్చరించారు.

Related Post