దయనీయ జీవితం గడుపుతున్న నటి పావలా శ్యామల

May 18, 2021
img

పావలా శ్యామల... ఆ పేరు తలుచుకోగానే ఆమె విలక్షణమైన హాస్య నటన గుర్తుకు వచ్చి అందరి పెదాలపై చిర్నవ్వులు పూస్తాయి. కానీ అందరికీ ఆనందం పంచిపెట్టిన ఆమె మాత్రం చాలాకాలంగా దయనీయ జీవితం గడుపుతోంది. 

ఆరోగ్యం సహకరించకపోవడంతో చాలా కాలం క్రితమే సినిమాలు చేయలేక మానుకొన్నారు. అదే సమయంలో కూతురు కూడా తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఆమె సినీ పరిశ్రమలో సంపాదించుకొన్నదంతా తల్లీ, కూతుళ్ళ వైద్య ఖర్చులు, మందులకే సరిపోయింది. 

ఇదివరకు చిరంజీవి రెండు లక్షలు, పవన్ కళ్యాణ్ లక్ష రూపాయలు సాయం చేశారని పావలా శ్యామల తెలిపారు. ఆమె పడుతున్న కష్టాల గురించి తెలుసుకొన్న సినీ నటి కరాటే కళ్యాణి ఆదివారం వారి ఇంటికి వెళ్ళి రూ.10,000 ఇచ్చారు. సినీ కళాకారుల సొసైటీలో ఆమె సభ్యత్వం తీసుకోకపోవడం పొరపాటు చేశానని ఆ కారణంగా సొసైటీ నుంచి సాయం అందుకోలేకపోతున్నానని పావలా శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. 

గత మూడు నెలలుగా తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న వృద్ధాప్య పింఛన్ నిలిచిపోవడంతో ఇంటి అద్దె కూడా కట్టలేకపోయానని చెప్పారు. తనకు వచ్చిన అవార్డులను అమ్ముకొని ఆ డబ్బుతో బియ్యం, పప్పులు కొనుకొన్నరోజులున్నాయని ఆమె చెప్పారు. అనారోగ్యంతో ఉన్న తాము తినడానికి తిండి లేక 5 రోజులు పస్తులున్నామని, ఇక మందులు ఎక్కడి నుంచి కొనుక్కోగలమని ఆవేదన వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమలో కరాటే కళ్యాణి వంటివారు, ఇరుగుపొరుగులు అందిస్తున్న సాయంతో భారంగా రోజులు గడుపుతున్నామని చెప్పారు. పరిస్థితులు ఇలాగే ఉంటే ఏదో ఓ రోజు ఇద్దరం మంచంలోనే ఆకలితో చనిపోతామని పావలా శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. తనకు వృధాప్య పింఛన్ ఇచ్చి తెలంగాణ ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.  

పావలా శ్యామల 1984లో బాబాయ్ అబ్బాయ్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించి స్వర్ణ కమలం, కర్తవ్యం, ఇంద్ర, ఖడ్గం, బ్లేడ్ బాబ్జీ, గోలీమార్ వంటి సుమారు 250 సినిమాలలో హాస్య నటిగా, సహాయ నటిగా నటించారు. అనేకానేక అవార్డులు అందుకొన్నారు. ఆమె నటనకు అనేక సంస్థలు సన్మానాలు చేశాయి. అటువంటి ఆమెకు నేడు తినడానికి తిండి కూడా లేక, అనారోగ్య సమస్యలతో... కాటిక దారిద్ర్యంతో అల్లాడుతున్నారు. 

పావలా శ్యామల ప్రస్తుతం ఎస్‌.ఆర్‌.నగర్‌ బీకేగూడలో (ఇంటి నెంబర్:9-1-309/25/1/2) చిన్న అద్దె ఇంట్లో కూతురితో కలిసి ఉంటున్నారు. ఆమెకు డబ్బు, మందులు, నిత్యావసర సరుకులు మరేదైనా ఇచ్చి సాయపడాలనుకొంటే నేరుగా ఆమె ఇంటికే వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది.


Related Post