ఈటలపై టిఆర్ఎస్‌ నేతల ఎదురు దాడి షురూ!

May 04, 2021
img

నిన్న మొన్నటి వరకు వారందరూ ఒకరినొకరు అన్నా...అన్నా... అంటూ ఆప్యాయంగా పలకరించుకొంటూ కలిసి మెలిసి పనిచేశారు. కానీ ఒక్కరోజులోనే వారు బద్ద శత్రువులైపోయారు. వారే...మాజీ మంత్రి ఈటల రాజేందర్‌, టిఆర్ఎస్‌ నేతలు. భూకబ్జాల ఆరోపణల కారణంగా ఈటలను మంత్రి వర్గంలో నుంచి తొలగించడంతో సహజంగానే ఈటల ఆత్మాభిమానం దెబ్బతింది. దాంతో ఆయన సిఎం కేసీఆర్‌, టిఆర్ఎస్‌ నేతలపై విమర్శలు చేశారు. తనకు వ్యతిరేకంగా టిఆర్ఎస్‌లో పెద్ద కుట్ర జరిగిందని వాదిస్తున్నారు. 

ఈటల విమర్శలతో టిఆర్ఎస్‌ నేతలు కూడా ఎదురుదాడి ప్రారంభిచారు. మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌ మిమ్మల్ని తమ్ముడుగా భావించి పదవులు, అధికారం, గౌరవం ఇస్తే మీరేమి చేశారు. పార్టీలో... ప్రభుత్వంలో జరగకూడనిదేదో జరిగిపోతోందన్నట్లు మాట్లాడుతూ మీ ఎదుగుదలకు కారణమైన సిఎం కేసీఆర్‌ను, పార్టీనే అవమానించారు. మీరు మీ పరిధి దాటి మాట్లాడుతున్నప్పటికీ సిఎం కేసీఆర్‌కు మీపై ఉన్న గౌరవంతో ఇంతకాలం ఎటువంటి చర్య తీసుకోకుండా సహించారు. సిఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తుంటే, ప్రభుత్వంలోనే ఉంటూ ప్రభుత్వ ప్రతిష్టాని దెబ్బ తీయాలని, తద్వారా అభివృద్ధికి ఆటంకం కలిగించాలని ప్రయత్నించారు. బడుగుబలహీన వర్గాలకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములను కొనుగోలుచేయడం నేరమని తెలిసి ఎందుకు కొనుగోలు చేశారు? మీరు బీసీనని చెప్పుకొంటూ బీసీలకు ఇచ్చిన అసైన్డ్ భూములను కాజేయడం తప్పుగా అనిపించడం లేదా?ఇదేనా మీరు వారికి చేసిన మహోపకారం? ఇన్ని తప్పులు చేసి మళ్ళీ సిఎం కేసీఆర్‌ను నిందిస్తున్నారు. అసలు మీ భూకబ్జాల గురించి ప్రజలకు సంజాయిషీ ఇవ్వకుండా సిఎం కేసీఆర్‌ను, ప్రభుత్వాన్ని ఎందుకు నిందిస్తున్నారు? పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను మీరు కబ్జా చేస్తే ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకోవడం తప్పెలా అవుతుంది? నిజానికి బీసీ ముసుగులో ఉన్న దొర మీరు. మేకవన్నె పులి మీరు. హుజూరాబాద్‌లో ఉన్నప్పుడు మీరు బీసీ అవతారం ఎత్తుతారు అదే... హైదరాబాద్‌కు వస్తే ఓసీగా మారిపోతుంటారు. ఇంతకాలం మంత్రిగా ఉన్న మీరు బీసీల కోసం ఏమి చేశారో చెప్పగలరా?” అంటూ ఘాటుగా ప్రతి విమర్శలు, ప్రశ్నల వర్షం కురిపించారు.

Related Post