హైకోర్టులో ఈటల కుటుంబం పిటిషన్‌ దాఖలు

May 04, 2021
img

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కుటుంబం హైకోర్టును ఆశ్రయించింది. ఈటల రాజేందర్‌, ఆయన భార్య జమున, కుమారుడు నితిన్, వారి జమునా హ్యాచరీస్ సంస్థ కలిసి పిటిషన్‌ వేశాయి. మెదక్‌ జిల్లా అచ్చంపేట గ్రామంలో తమ భూములలో తమ అనుమతి తీసుకోకుండా జిల్లా కలెక్టర్ హరీష్, రెవెన్యూ అధికారులు, సర్వే చేయించడం, అవి ప్రభుత్వ భూములని బోర్డులు పెట్టడం చట్టవిరుద్దమని పిటిషన్‌లో పేర్కొన్నారు. తమ భూములలో ఎవరూ ప్రవేశించకుండా జిల్లా కలెక్టర్ హరీష్, డిజిపి మహేందర్ రెడ్డి, విజిలెన్స్ అధికారులను ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. దీనిని హైకోర్టు విచారణకు స్వీకరించింది. బహుశః నేడు దీనిపై విచారణ చేపట్టే అవకాశం ఉంది. 

ఈటల రాజేందర్‌ స్వయంగా హైకోర్టులో పిటిషన్‌ వేయడంతో తెలంగాణ ప్రభుత్వం దీనిపై అధికారులు తయారుచేసిన నివేదికలను హైకోర్టుకు సమర్పించి ఆయన భూకబ్జాలకు పాల్పడ్డారని నిరూపించవలసివస్తుంది. ఇది ఈటలకు, తెలంగాణ ప్రభుత్వానికి కూడా ప్రతిష్టకు సంబందించిన విషయం కనుక ఈ కేసులో ఎవరు తప్పు చేసినట్లు రుజువైనా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి రావచ్చు.

Related Post