పెద్దపల్లి రామగిరి కోట చూసొద్దామా?

March 03, 2021
img

తెలంగాణ రాష్ట్రంలో అనేక పర్యాటక ప్రదేశాలున్నాయి. వాటిలో కొన్ని మనసును ఆహ్లాదపరిచేవైతే, ఇంకొన్ని ఆధ్యాత్మిక భావనలను కలిగిస్తాయి. 

పెద్దపెల్లి జిల్లాలోని కమాన్‌పూర్ మండలం బేగంపేట గ్రామానికి సమీపంలో గల రామగిరికోట ఉంది. దాని ప్రత్యేకత ఏమిటంటే ఆధ్యాత్మికత, ఆహ్లాదకరమైన వాతావరణం రెండూ ఉన్నాయి. రామగిరి కోట మొత్తం తిరిగి చూడాలంటే సుమారు 16 కిలోమీటర్లు కాలినడకన నడవాల్సి ఉంటుంది. కానీ అంత నడిచినా ఆహ్లాదకరమైన వాతావరణం కారణంగా అలసట అనిపించదు. కోట చుట్టూ రమణీయమైన ప్రకృతి దృశ్యాలు మనసును ఆహ్లాదపరుస్తాయి. 

శ్రీ సీతారామలక్షణులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు రామగిరి కోటలో కొంతకాలం ఉన్నారని చరిత్రకారుల చెపుతున్నారు. అందుకు సాక్ష్యంగా రామగిరి కోటలోని ఓ బండ రాతిపై శ్రీరాముని పాదాలు, సీతామాత స్నానమాచరించిన కొలను ఉన్నాయి. అలాగే కోటలో ఆంజనేయుడి విగ్రహం కూడా ఉంది.  కోటలో అనేక రహస్య మార్గాలు, సీతమ్మ బావి, చక్కెర బావి,  గజశాల వంటి ప్రదేశాలు పర్యాటకులను ఆహ్లాదపరుస్తాయి. కోటలో అనేక విలువైన ఔషధ మొక్కలు ఉన్నాయని స్థానికులు చెపుతుంటారు. 

ఏటా శ్రావణమాసంలో రామగిరి కోటకు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. హైదరాబాదు నుండి రామగిరి కోటకు వెళ్లాలంటే పెద్దపల్లి వరకు ట్రైన్లో ప్రయాణించవచ్చు. పెద్దపల్లి రైల్వే స్టేషన్ నుండి ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు నిరంతరం అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ నుండి పెద్దపల్లి వరకు ఆర్టీసీ బస్సులు కూడా ఉన్నాయి.

Related Post