గండిపేటలో యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి

March 03, 2021
img

నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో హైదర్షాకోట్‌ ప్రాంతంలో మంగళవారం రాత్రి ఓ ప్రేమోన్మాది తాను ప్రేమిస్తున్న యువతి ఇంట్లోకి జొరబడి కత్తితో దాడి చేశాడు. హైదర్షాకోట్‌కి చెందిన యువతి (29) హైదరాబాద్‌లో ఓ ఐ‌టి కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేస్తోంది. అదే ప్రాంతంలో ఉన్న ఓ హైక్లాస్ సెలూన్‌లో పనిచేస్తున్న హర్యానాకు చెందిన షారూఖ్ సల్మాన్ (29)తో పరిచయం ఏర్పడింది. వారిరువురి పరిచయం స్నేహంగా మారడంతో అప్పుడప్పుడు అతను ఆ యువతి ఇంటికి కూడా వచ్చేవాడు. కానీ ఇటీవల ఆమె తల్లితండ్రులు ఆమెకు ఓ పెళ్ళి సంబంధం ఖాయం చేసి, ఈ ఏడాది మే నెలలో పెళ్ళి చేయాలని నిశ్చయించడంతో ఆమె షారూఖ్ ను కలవడం మానేసింది. ఆమె తనను కాదని వేరే వ్యక్తిని పెళ్ళి చేసుకోబోతోందని షారూఖ్ ఆవేశంతో మంగళవారం రాత్రి సుమారు 7.30 గంటలకు హైదర్షాకోట్‌లోని ఆమె ఇంట్లోకి జొరబడి కత్తితో పొడిచాడు. విషయం తెలుసుకొన్న ఇరుగుపొరుగువారు అతనిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఆమె వీపుపై రెండు పెద్ద కత్తిపోట్లవడంతో వైద్యులు అత్యవసర చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.   


Related Post