సిద్ధిపేటలో ఆవులు వధ... ఉద్రిక్త పరిస్థితులు

February 27, 2021
img

సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని పాతపుల్లూరు రోడ్డులో ఉన్న ఓ కోళ్ళ ఫారంలో 15 ఆవులను వధించినట్లు తెలియడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమాచారం అందుకొన్న బిజెపి, బజరంగ్‌దళ్, విహెచ్‌పి, హిందూవాహినిలకు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకొన్నారు. గోవులను వధించినవారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ వారు పట్టణంలో మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు  నెలకొన్నాయి. అనంతరం వారు పాత బస్టాండ్ వద్ద నిరసనలు తెలియజేస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారికీ, పోలీసులకు మద్య చాలాసేపు వాగ్వాదం కొనసాగింది. కానీ వారు ఎంతకీ శాంతించకపోవడంతో పోలీస్ కమీషనర్ జోయల్ డేవిస్ అక్కడకు చేరుకొని ఆవులను చంపినవారిని వీలైనంత త్వరలో అరెస్ట్ చేస్తామని వారికి నచ్చజెప్పడంతో శాంతించారు. 

పోలీసుల సమాచారం ప్రకారం కొన్ని రోజుల క్రితం కొందరు వ్యక్తులు ఆవుమాంసం అమ్మేందుకు వేరే ప్రాంతం నుంచి  40 ఆవులను వ్యానులలో అక్కడకు తీసుకువచ్చి ఉంచారు. వాటిలో 15 ఆవులను చంపి వాటి మాంసం విక్రయించారు. కోళ్ళ ఫారంలో గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారం ఎలాగో బయటకు పొక్కడంతో మిగిలిన ఆవులను వదిలి పరారయ్యారు. ఆవులను చంపడానికి కోళ్ళ ఫారాన్ని వాడుకొనేందుకు ఇచ్చిన యజమానితో సహా 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిచ్చిన సమాచారంతో పరారీలో ఉన్న మిగిలినవారికోసం గాలిస్తున్నారు. మిగిలిన ఆవులను స్థానిక గోశాలకు తరలించారు. 

మళ్ళీ ఎటువంటి అవాంఛనీయఘటనలు జరుగకుండా సిద్ధిపేట పట్టణంలో భారీగా పోలీసులను మోహరించారు. ఏసీపీ రామేశ్వర్, వన్ టౌన్ సీఐ సైదులు ఎప్పటికప్పుడు పట్టణంలో శాంతిభద్రతల పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై పుకార్లు వ్యాపింపజేస్తే కటిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. అలాగే ప్రజలెవరూ పుకార్లను నమ్మవద్దని అందరూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేసారు.

Related Post