కనకదుర్గ గుడిలో అవినీతికి అద్దంపడుతున్న సస్పెన్షన్స్

February 23, 2021
img

విజయవాడ కనకదుర్గ గుడి ప్రాశస్త్యం గురించి అందరికీ తెలుసు. కానీ ఆలయంలో అధికారుల అవినీతి, సిబ్బంది చేతివాటం, రాసలీలలు గురించి తరచూ వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ఇటువంటివి భక్తుల నమ్మకాన్ని, మనోభావాలను దెబ్బతీస్తాయని తెలిసినా ఇవన్నీ వారికి అలవాటుగా...పరిపాటిగా మారిపోయాయంటే అతిశయోక్తి కాదు. 

అయితే ఇటీవల కాలంలో ఇవి మరి శృతి మించిపోవడంతో గత వారం రోజులుగా అవినీతినిరోధకశాఖ అధికారులు కనకదుర్గ గుడిలో వీటన్నిపై దర్యాప్తు జరిపారు. ఆలయ ప్రాంగణంలోని దుకాణాల లీజు వ్యవహారాలు, అమ్మవారికి భక్తులు సమర్పించుకొన్న చీరల వేలంపాట, అన్నదానం కోసం సరుకుల కొనుగోలు, దర్శనం టికెట్ల జారీ, ఆలయ భూముల వ్యవహారాలలో భారీ అవినీతి, అక్రమాలు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. 

ఆ నివేదిక ఆధారం కనకదుర్గమ్మ గుడిలో ఐదుగురు సూపరింటెండెంట్‌ స్థాయి అధికారులతో సహా మొత్తం 13 మందిపై రాష్ట్ర దేవాదాయశాఖ సస్పెన్షన్ వేటు వేసింది. ఆలయంలోని ఏడు విభాగాలలో పనిచేస్తున్న 13 మందిని తక్షణం సస్పెండ్ చేయాలని ఆదేశిస్తూ ఏపీ రాష్ట్ర దేవాదాయశాఖ ప్రత్యేక కమీషనర్ అర్జునరావు సోమవారం ఆలయ ఈఓ సురేష్ బాబుకు ఉత్తర్వులు జారీ చేశారు. 

ఒకేసారి ఐదుగురు సూపరింటెండెంట్‌ స్థాయి అధికారులతో సహా మొత్తం 13 మందిని సస్పెండ్ చేయడం కనకదుర్గమ్మ గుడిలో జరుగుతున్న అవినీతికి అద్దం పడుతోందని భావించవచ్చు. కొన్ని నెలల క్రితం అమ్మవారి రథంపై బిగించిన మూడు వెండి సింహం బొమ్మల దొంగతనం జరిగింది. ఆలయ సిబ్బందే వాటిని దొంగిలించారా...లేక బయటి వ్యక్తులు ఎత్తుకుపోయారో తెలీదు. 

Related Post