ఆదిలాబాద్‌లో నాగోబా దేవాలయం పునర్నిర్మాణం

January 15, 2021
img

ఆదివాసీలలో మెస్రం వంశీయుల ఆరాధ్యదేవత నాగోబా. ఆదిలాబాద్‌ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌ గల నాగోబా ఆలయంలో ఏటా పుష్యమాసంలో పూజలు చేసి జాతర నిర్వహిస్తుంటారు. దానికి ఆదివాసీలు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా వెళుతుంటారు. 

ఒకప్పటి గోండ్వానా రాజుల కాలంలో నాగోబా ఆలయం చిన్న పూరిపాకలో ఉండేది. ఆ తరువాత 2005లో రూ.10 లక్షలతో అక్కడ చిన్న ఆలయం నిర్మించారు. ఇప్పుడు దాని స్థానంలో రూ.3.50 కోట్లు ఖర్చు చేసి సువిశాలమైన ఆలయాన్ని పూర్తిగా రాతితో నిర్మిస్తున్నారు. మెస్రం వంశీయులు రూ.3 కోట్లతో నాగోబా ఆలయ నిర్మాణపనులు చేపట్టగా రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షలు అందజేసింది. 

ప్రస్తుతం నాగోబా గర్భగుడి దాదాపు పూర్తికాగా, దాని ఎదురుగా ఉన్న మండపంలోని రాతి స్తంభాలను చెక్కి నిలబెట్టారు. త్వరలోనే వాటిపై పైకప్పు నిర్మాణపనులు ప్రారంభం కానున్నాయి. నాగోబా ఆలయంలోని ఏర్పాటు చేసిన రాతి స్తంభాలపై అలనాటి గోండ్వానా రాజుల చరిత్రను, నేటి మెస్రా వంశీయుల ఆచార వ్యవహారాలను కళ్ళకు కట్టేలా శిల్పాలను చెక్కారు. గర్భగుడి ముఖద్వారానికి ఇరువైపులా రెండుపాములను చెక్కారు. 

ఫిబ్రవరిలో పుష్యమాసం మొదలవగానే మెస్రం వంశీయులు గోదావరి జలాలను కేస్లాపూర్ తీసుకువచ్చి నాగోబా ఆలయంలో అభిషేకం చేయడంతో నాగోబా జాతర మొదలవుతుంది. అయితే ఈసారి కరోనా భయాలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు కనుక కేవలం పూజలకు మాత్రమే అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

Related Post