ఇండోనేసియాలో భారీ భూకంపం

January 15, 2021
img

ఇండోనేషియా ప్రజలు వరుస దుర్ఘటనలతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గతవారం జరిగిన విమాన ప్రమాదంలో విమాన సిబ్బందితో సహా 63మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ సంఘటన మరువకముందే భారత కాలమాన ప్రకారం శుక్రవారం ఉదయం (స్థానిక కాలమాన ప్రకారం రాత్రి ఒంటి గంటకు) ఇండోనేసియాలోని సులవేసి దీవిలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 6.2గా నమోదైంది. కొన్ని సెకన్లపాటే భూకంపం వచ్చినప్పటికీ చాలా తీవ్ర స్థాయిలో ఉండటంతో సుమారు 60కి పైగా ఇళ్ళు, ఓ ప్రభుత్వ కార్యాలయం, ఓ ఆసుపత్రి భవనం కూలిపోయాయి. పెద్ద శబ్ధాలతో భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఏడుగురు మరణించగా సుమారు 649 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. శిధిలాల క్రింద ఇంకా అనేకమంది చిక్కుకొని ఉన్నందున మరణించినవారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. సులవేసి దీవికి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేజిని నగరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. గత మూడు రోజులలో ఇండోనేసియాలో పలుప్రాంతాలలో వరుసగా మూడుసార్లు భూకంపాలు రావడంతో ప్రజలు భయంభయంగా గడుపుతున్నారు.

Related Post