గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ఏటిఎస్) హైదరాబాద్‌లో సోదాలు జరిపింది. హైదరాబాద్ టోలీచౌక్ వద్ద వైద్యుడుగా పనిచేస్తున్న డా.అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ (35)ని ఈ నెల 9న అహ్మదాబాద్ నుంచి కారులో హైదరాబాద్ వస్తున్నప్పుడు, ఏటిఎస్ బృందం అతని కారు తనికీ చేయగా కొన్ని ఆయుధాలు లభించడంతో అరెస్ట్ చేసింది. అతను ఇచ్చిన సమాచారంతో యూపీలో మరో ఇద్దరినీ ఏటిఎస్ అరెస్ట్ చేసింది.
వారిని అరెస్టు చేసి విచారించినప్పుడు దిగ్బ్రాంతి కలిగించే కొన్ని విషయాలు బయటపడ్డాయి. పాకిస్తాన్ నుంచి డ్రోన్ల ద్వారా రాజస్థాన్‌లోని హనుమాన్ ఘడ్ అనే సరిహద్దు ప్రాంతంలో చేరే ఆయుధాలను వారు పోగుచేసి, ఢిల్లీతో సహా దేశంలో కొన్ని ప్రధాన నగరాలలో ఈ ఏడాదిలోనే ఢిల్లీ కారు బాంబు తరహా దాడులు చేయాలని ప్లాన్ చేసుకున్నారు.
ఇంకా దిగ్బ్రాంతి కలిగించే విషయం ఏమిటంటే, డా.అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ అత్యంత ప్రమాదకరమిన ‘రిసిన్’ అనే రసాయనాన్ని తయారుచేస్తున్నాడు. ఇదొక రకం ‘నెర్వ్ గ్యాస్.’ దానిని జన సమర్ధం ఉన్న ప్రాంతాలలో ప్రయోగించడం ద్వారా పెద్ద ఎత్తున సామూహిక హత్యలు చేయాలని ప్లాన్ చేశాడు.
అదృష్టవశాత్తు అతను ఏటిఎస్‌కి పట్టుబడ్డాడు. లేకుంటే భారత్‌లో తొలిసారిగా బయో-వెపన్ ప్రయోగం జరిగి అనేక మంది చనిపోయి ఉండేవారు.
గుజరాత్ ఏటిఎస్ బృందాలు నిన్న హైదరాబాద్ చేరుకొని రాజేంద్ర నగర్‌లోని డా.అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ ఇంటిని సోదాలు చేసి కొన్ని కీలకమైన పత్రాలు, ల్యాప్ టాప్, రిసిన్ తయారీకి సంబందించిన కొన్ని ఆధారాలు వగైరా స్వాధీనం చేసుకున్నారు.
ఢిల్లీ కారు బాంబ్ బ్లాస్ట్ తర్వాత ఎన్ఐఏ బృందాలు దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాలలో సోదాలు నిర్వహిస్తున్నాయి.
ఎన్ఐఏ బృందాలు మంగళవారం ఏపీలోని గుంటూరు, విశాఖపట్నం, విజయనగరంలో సోదాలు నిర్వహించి కొందరు యువకులను అరెస్ట్ చేశారు. వారు టెలిగ్రాం ద్వారా ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థతో జరిపిన చాటింగ్ ఆధారంగా ఎన్ఐఏ బృందాలు వారిని కనిపెట్టి అరెస్ట్ చేశాయి.