కోలీవుడ్ హీరో దళపతి విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ అనే పార్టీ పెట్టుకొని తమిళనాడు ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. 2026లో జరుగబోయే తమిళనాడు శాసనసభ ఎన్నికలలో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా దళపతి విజయ్ అని ఆ పార్టీ ఈరోజు అధికారిక ప్రకటన చేసింది.
ఈ సందర్భంగా దళపతి విజయ్ పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ, “వచ్చే ఎన్నికలలో మనం బీజేపి, డీఎంకే, అన్నాడీఎంకే ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోవడం లేదు. అన్ని స్థానాలకు ఒంటరిగానే పోటీ చేసి గెలిచి మన సత్తా ఏమిటో చూపిద్దాం.
బీజేపి మత రాజకీయాలు చేస్తూ దేశ ప్రజల మద్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తోంది. తమిళనాడుపై బలవంతంగా హిందీ, సంస్కృతం భాషలను రుద్దడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే గట్టిగా ఎదుర్కొందాం.
వచ్చే ఎన్నికల కోసం మనం వచ్చే నెల నుంచే రాష్ట్ర వ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజలకు మన పార్టీ ఆశయాలు, విధానాలు వివరించాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో సభలు సమావేశాలు నిర్వహించి వారిని చైతన్య పరచాల్సిన అవసరం ఉంది, “ అని చెప్పారు.
తమిళనాడులో వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్ నెలల మద్య శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. సాధారణ రోజులలోనే తమిళనాడులో రాజకీయపార్టీల హడావుడి చాలా ఉంటుంది. ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడి, దళపతి విజయ్ కూడా ఎన్నికల ప్రచారం మొదలుపెడితే మిగిలిన పార్టీలు చేతులు ముడుచుకొని కూర్చోవు. కనుక ఆగస్ట్ నుంచీ తమిళనాడులో రాజకీయ వాతావరణం వేడెక్కడం ప్రారంభమయ్యే అవకాశం ఉంది.