ప్రభాకర్, ప్రణీత్ రావు ఏం చెపుతారో?

June 13, 2025


img

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ప్రభాకర్ రావుని సిట్ బృందం ఇప్పటికే రెండుసార్లు ప్రశ్నించి కొన్ని వివరాలు రాబట్టింది. రేపు మరోసారి ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. 

రేపు ఆయనతో పాటు ఈ కేసులో మరో నిందితుడుగా ఉన్న సస్పెండ్ అయిన డీఎస్పీ ప్రణీత్ రావుకి కూడా సిట్ బృందం నోటీస్ పంపి రేపు (శనివారం) విచారణకు హాజరు కావలసిందిగా ఆదేశించింది. 

ఇదివరకు ప్రణీత్ రావుని అరెస్ట్‌ చేసి ప్రశ్నించినప్పుడు ప్రభాకర్ రావు ఆదేశం మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశామని, ప్రభుత్వం మారగానే ఆయన ఆదేశం మేరకు సాక్ష్యాలు దొరకకుండా కంప్యూటర్ హార్డ్ డిస్కులను నాశనం చేసి మూసీ నదిలో పడేశామని చెప్పారు.

సిట్ అధికారులు వాటిని వెలికి తీసి, ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. కనుక వాటి గురించి ప్రణీత్ రావుని ప్రభాకర్ రావు ఎదుటే ప్రశ్నించి వివరాలు రాబట్టేందుకు సిట్ అధికారులు ప్రయత్నించనున్నారని సమాచారం. 

ఈ కేసు విచారణ మొదలైనప్పుడు, ఫోన్ ట్యాపింగ్‌తో తనకు ఎటువంటి సంబందమూ లేదని, ఒకవేళ జరిగి ఉంటే అందుకు సంబంధిత అధికారులే బాధ్యులని మాజీ సిఎం కేసీఆర్‌ చెప్పేశారు. 

ఇప్పుడు ఈ కేసు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావుల మెడకు చుట్టుకునే ప్రమాదం ఉంటుంది కనుక వారు కేసీఆర్‌ ఆదేశం మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్తే కేసీఆర్ ఈ కేసు నుంచి తప్పించుకోవడం చాలా కష్టమే! 


Related Post