పార్లమెంట్ సమావేశపరచండి మోడీజీ: రాహుల్ లేఖ

May 14, 2025


img

కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈ నెల 10న ప్రధాని మోడీకి ఓ లేఖ వ్రాశారు. పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్‌, కాల్పుల విరమణ గురించి పార్లమెంట్ సభ్యులు చర్చించాల్సిన అవసరం ఉంది కనుక పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని రాహుల్ కోరారు. 

కాల్పుల విరమణపై భారత్‌, పాక్‌ కంటే ముందుగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ ప్రకటన చేయడాన్ని ప్రస్తావిస్తూ, ఈ పరిణామాలన్నిటిపై పార్లమెంటులో చర్చించుకొని భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్ళని ఏవిదంగా ఎదుర్కోవాలో సమిష్టి నిర్ణయం తీసుకోవడం చాలా అవసరమని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. 

దేశంలో బీజేపియేతర పార్టీలు కూడా పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతున్నాయి. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు కానీ ప్రధాని మోడీ మొన్న దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, పహల్గాం దాడి మొదలు కాల్పుల విరమణ వరకు జరిగిన ప్రతీ పరిణామం గురించి వివరించారు. 

అలాగే ఒకవేళ పాక్‌ మళ్ళీ భారత్‌పై దాడులకు ప్రయత్నిస్తే ఈసారి ఇంకా భయంకరంగా ఎదురుదాడులు చేస్తామని హెచ్చరించారు కూడా. కనుక భారత్‌-పాక్‌ ఘర్షణల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉందని స్పష్టమవుతోంది. కనుక పార్లమెంట్ ప్రత్యేక సమావేశం నిర్వహించకపోవచ్చు. 



Related Post