భారత్ ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం రాత్రి దేశ ప్రజలని ఉద్దేశించి ప్రసంగించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారిగా ప్రధాని మోడీ మీడియా ముందుకు వచ్చి దేశ ప్రజలకు తాజా పరిణామాలు వివరించారు. ఆయనెమన్నారో క్లుప్తంగా..
పాక్ మన దేశ సరిహద్దులపై దాడులకు పరిమితమైతే మనం దాని గుండె కాయ వంటి ఆర్మీ, వైమానిక, ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి మన సత్తా చూపాము. వారి ప్రధాన సైనిక మౌలిక వసతులు ధ్వంసం చేయడంతో వారు గజగజా వణికిపోయారు. సుమారు 100 మందికి పైగా కారాదు గట్టిన ఉగ్రవాదులకు హతమార్చాము. అందువల్లే పాక్ పాలకులు ప్రపంచ దేశాల చుట్టూ తిరిగి కాళ్ళ బేరానికి వచ్చారు.
ప్రస్తుతానికి యుద్ధ విరమణ చేసినప్పటికీ, పాక్ మళ్ళీ మన దేశంపై ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా ఈసారి పరిణామాలు చాలు దారుణంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాను. పాక్‌తో చర్చాలంటూ జరిగితే ఉగ్రవాద నిర్మూలన, పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశాలపై తప్ప మరో అంశంపై ఉండవని ఇప్పటికే స్పష్టం చేశాము.
ఈ 21 వ దశాబ్దపు అత్యాధునిక యుద్ధంలో మన సైనిక, అస్త్ర, సాంకేతిక సామర్ధ్యం పాకిస్థాన్‌కి రుచి చూపించాము. స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసుకున్న మన అస్త్ర శాస్త్రాల పనితీరు ఎంత అద్భుతంగా ఉంటుందో యావత్ ప్రపంచ దేశాలు చూశాయి. వారి క్షిపణులు, డ్రోన్లు గడ్డిపోచల్లా రాలిపోయాయి. మన సైన్యం అత్యంత ఖచ్చితత్వంతో కేవలం మూడు గంటలలో వారి ముఖ్య స్థావరాలను నాశనం చేయడం యావత్ ప్రపంచ దేశాలు చూశాయి.
పహల్గాం దాడిలో పురుషులను వారి మతం అడిగి తెలుసుకొని, వారి భార్యా, పిల్లల ముందే కాల్చి చంపడం నాకు చాలా బాధ కలిగించింది. వారి మనోవేదన తీర్చి, న్యాయం చేసేందుకే ఆపరేషన్ సింధూర్ నిర్వహించాము. వారితో పాటు యావత్ దేశ ప్రజలు సంఘీభావం తెలిపారు.
ఇవాళ్ళ బుద్ధ పూర్ణిమ సందర్భంగా ఓ విషయం చెప్పదలచుకున్నాను. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుంది. కానీ ఆ శాంతి మార్గం కూడా అత్యంత శక్తివంతమైనదని నిరూపించి చూపాము. భారత్ ఎవరి జోలికి వెళ్ళదు. కానీ మన జోలికి వస్తే మన శక్తి సామర్ధ్యాలు ప్రయోగించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ మూడు రోజులలో అదే చేశాము.
ఆపరేషన్ సింధూర్‌లో పాల్గొన మన వీర జవాన్లకు, వారి కుటుంబాలకు, మన సైన్యానికి ఇటువంటి అద్భుతమైన అస్త్ర శస్త్రాలు అందించిన మన శాస్త్రవేత్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
పహల్గాం దాడిలో భర్తలు కోల్పోయిన సోదరీమణులకు, దేశ ప్రజలకు ముఖ్యంగా మహిళలకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాను. భారత్ మాతా కీ జై!”