జైలుకు పోతారు జాగ్రత్త: సుప్రీంకోర్టు వార్నింగ్

April 16, 2025


img

కంచ గచ్చిబౌలి భూముల వేలం వేసి ఆదాయం సమకూర్చుకోవాలని తెలంగాణ ప్రభుత్వం అనుకుంటే వరుసపెట్టి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. 

మొదట ప్రతిపక్షాలు, హెచ్‌సీయూ విద్యార్ధులు అడ్డుపడ్డారు. తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టులు స్టే విధించి అడ్డుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ భూములను ఐసీఐసీఐ బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.10,000 కోట్లు అప్పు తెచ్చుకుంది. ఆ అప్పు భారం మెడకు గుదిబండలా ఉంది. దానిని వదిలించుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తే, హైకోర్టు, సుప్రీంకోర్టులో గట్టిగా మొట్టికాయలు పడుతున్నాయి.

జస్టిస్ గవాయ్ నేతృత్వంలో సుప్రీంకోర్టు ధర్మాసనం నేడు విచారణ చేపట్టినప్పుడు తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు పాత తీర్పుకి వ్యతిరేకంగా అక్కడ చెట్లు నరికిన్నట్లు రుజువైతే సీఎస్‌తో సహా సంబంధిత అధికారులు అందరూ జైలుకి వెళ్ళవలసి వస్తుందని జస్టిస్ గవాయ్ హెచ్చరించారు. మే 15న ఈ కేసు తదుపరి విచారణ జరుగుతుంది. 

మరోపక్క ప్రభుత్వం తనవి కాని భూములను తనవిగా చెప్పుకొని బ్యాంకులో తాకట్టుపెట్టడం ఆర్ధిక నేరమని, వాటిపై తెచ్చిన రూ.10,000 కోట్లకు లెక్కలు చెప్పాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. మద్యలో ఓ బ్రోకరేజ్ కంపెనీకి రూ.170 కోట్లు చెల్లించడం వెనుక భారీ కుంభకోణం కనిపిస్తోందని, కనుక దీనిపై ఈడీ విచారణ జరపాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. 

ప్రధాని మోడీ కూడా ఈ భూముల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరుని తప్పు పట్టారు. కనుక ఇప్పుడు ముందుకు, వెనక్కు వెళ్లలేని పరిస్థితిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. మరి ఈ సమస్యల నుంచి ప్రభుత్వం ఏవిదంగా బయటపడుతుందో? ఎప్పటికీ పడుతుందో? 



Related Post