ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన సూత్రధారిగా భావించబడుతున్న తెలంగాణ స్పెషల్ ఇంటలిజన్స్ బ్యూరో (సిఐబి) మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయనకు ముందస్తు బెయిల్ ఇస్తే హైదరాబాద్ తిరిగి వచ్చి ఈ కేసులో విచారణకు సహకరిస్తారని ఆయన తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి హైకోర్టుకి తెలిపారు.
ఈ కేసులో నిందితుడుగా ఉన్న శ్రవణ్ రావుకి ముందస్తు బెయిల్ ఇచ్చినందున ఆయన విచారణకు హాజరవుతున్నారని, అదేవిదంగా ప్రభాకర్ రావుకి కూడా ముందస్తు బెయిల్ ఇస్తే అమెరికా నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారని హైకోర్టుకి తెలిపారు.
కానీ ఆయనకు బెయిల్ మంజూరు చేయవద్దని పోలీసుల తరపు న్యాయవాది వాదించారు. ఆయన పాస్ పోర్టు కూడా రద్దయిందని, కనుక ఏవిదంగా ఆయన అమెరికా నుంచి హైదరాబాద్ తిరిగి వస్తారని ప్రశ్నించారు.
ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత ఈ కేసు తదుపరి విచారణని ఏప్రిల్ 25కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.
ఇంతకాలంగా ఆయనని వెనక్కు రప్పించేందుకు తెలంగాణ పోలీసులు విశ్వప్రయత్నాలు చేశారు. చివరికి ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీస్ కూడా ఇప్పించారు. కానీ రప్పించలేకపోయారు.
ఇప్పుడు ఆయన అంతట ఆయన విచారణకు హాజరవుతానని హైకోర్టుకి చెపుతున్నప్పుడు, ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దని పోలీసులు తరపు న్యాయవాది వాదిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఒకవేళ ముందస్తు బెయిల్ మంజూరు చేయకపోతే ఆయనని రప్పించడం కష్టమని తెలిసి ఉన్నప్పుడు, ఇచ్చి రప్పించడమే తెలివైన పని కదా? ఆ తర్వాత ఈ కేసులో విచారణ జరిపి అవసరమైతే హైకోర్టుని ఆశ్రయించి బెయిల్ రద్దు చేయించే వెసులుబాటు ఉంది కదా?