ఏప్రిల్ 27న వరంగల్లో జరుగబోయే బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవసభ కోసం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహక సభలలో పాల్గొని ప్రసంగిస్తున్నారు. ఆదివారం కరీంనగర్ సన్నాహక సభలో కేటీఆర్ మాట్లాడుతూ, “నేను కేసీఆర్ అంత మంచోడిని కాను. మళ్ళీ మనం అధికారంలోకి రాగానే ఇప్పుడు మన కార్యకర్తలను వేధిస్తున్న ప్రతీ కాంగ్రెస్ నాయకుడు, అధికారిని తప్పకుండా తాట తీస్తా.
అప్పటికి మేము రిటైర్ అయిపోతాము కనుక విదేశాలకు వెళ్ళిపోతామని అనుకుంటున్నారు. కానీ వారు ఏ దేశానికి పారిపోయినా సరే వెనక్కు రప్పించి తాట తీస్తా.
కాంగ్రెసోళ్ళు ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటే మనోళ్ళు మరేదో అనుకుని ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కానీ ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జన్సీ, పోలీసులు, అరెస్టులు, కేసులు.. అని నిరూపిస్తోంది ఈ కాంగ్రెస్ సర్కార్. పోలీసులు దొంగలను పట్టుకోవడం మానేసి మన వెంట పడుతున్నారిప్పుడు. సోషల్ మీడియాలో ఒక్క ట్వీట్ పెడితే వెంటనే పోలీసోడు నుంచి మనకి ఫోన్ వస్తుంది. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదే,” అని కేటీఆర్ వ్యంగ్యంగా విమర్శించారు.