మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మహబూబాబాద్ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో గురువారం సమావేశమైనప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
“రేవంత్ రెడ్డి కేవలం 15 నెలల్లోనే రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారు. ఈ కారణంగా ప్రజల్లో నానాటికీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగిపోతోంది. రేవంత్ రెడ్డి తీరు పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో కూడా అసంతృప్తి ఉంది. అందుకే ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమయ్యారు.
గత ఆరు నెలలుగా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి గురించి తెలుసుకునేందుకు రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనకు రావాలనుకున్నారు. కానీ ఆయన వస్తే తన బండారం బయటపడుతుందని రేవంత్ రెడ్డి, ఢిల్లీ పెద్దలతో మాట్లాడి ఆయన పర్యటన రద్దు చేయించారు.
ఓటమి భయంతోనే రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించేందుకు భయపడుతూ వాయిదా వేస్తున్నారు. శాసనసభ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను ప్రజలు నమమి ఓట్లు వేసి గెలిపించారు.
కానీ 15 నెలల పాలన చూసిన ప్రజలు ఇప్పుడు ఆయన చెప్పే మాటలను నమ్మడం లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే బిఆర్ఎస్ పార్టీ 100 సీట్లు గెలుచుకొని అధికారంలోకి వస్తుంది,” అని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.