చిలుకూరు బాలాజీ ఆలయానికి విదేశాలకు వెళ్ళి ఉన్నత చదువులు, ఉద్యోగాలు చేసుకోవాలని కోరుకునేవారు చిలుకూరు బాలాజీని దర్శించుకుంటారు. అందుకే చిలుకూరు బాలాజీకి వీసా బాలాజీ అనే ముద్దు పేరు కూడా వచ్చింది. ఈ ఆలయానికి భక్తులు పోటెత్తడం సాధారణమే.
కానీ ఇప్పుడు రోజూ డజన్ల కొద్దీ రాజకీయ నాయకులు వస్తున్నారు. అలాగని వారెవరికీ విదేశాలు వెళ్ళే ఆలోచన లేదు. విదేశీ వీసాలు అవసరం కూడా లేదు. మరెందుకు?అంటే ఇటీవల చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై రామరాజ్యం అనే సంస్థకు చెందిన కొందరు దుండగులు దాడి చేయడంతో ఆయనని పరామర్శించేందుకు వస్తున్నారు.
కనుక మన రాజకీయ నాయకులు అందరికీ ఆయనపై అపారమైన గౌరవం, అభిమానం ఉన్నందునా?అంటే కాదని అందరికీ తెలుసు. మరి దేని కోసం ఈ పరామర్శ పోటీలు?అంటే బహుశః జీహెచ్ఎంసీ ఎన్నికలలో హిందూ ఓటు బ్యాంక్ కోసమే కావచ్చు.
సిఎం రేవంత్ రెడ్డి ఆదేశం మేరకు తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ వచ్చి రంగరాజన్‌ని పరామర్శించి వెళ్ళారు. ఆ తర్వాత ముందుగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించి వెళ్ళారు. ఆయన అటు వెళ్ళగానే తెలంగాణ బీజేపి అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరామర్శించి వెళ్ళారు. తర్వాత మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించి వెళ్ళారు.
ఇంకా చాలా మంది నాయకులు పరామర్శలకు వస్తూనే ఉన్నారు. వారి పరామర్శలతో ఆయనకు స్వామివారికి నిత్య పూజలు, కైంకర్యాలు చేసేందుకు కూడా సమయం ఉండటం లేదు పాపం!
బిఆర్ఎస్ నేతలతో ఫోటోలు దిగితే కాంగ్రెస్‌కు కోపం. కాంగ్రెస్‌తో దిగితే బిఆర్ఎస్‌కి కోపం. బీజేపితో దిగితే మజ్లీస్ పార్టీకి కోపం వస్తుంది. కనుక ఆ దుండగుల దాడి కంటే ఈ రాజకీయ దాడులే తట్టుకోవడమే ఆయనకు ఇంకా కష్టం.
చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌ను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు
— BIG TV Breaking News (@bigtvtelugu) February 11, 2025
మంత్రితో పాటు ఎమ్మెల్యేలు మహేందర్‌రెడ్డి, కాలే యాదయ్య pic.twitter.com/mwjmmNfMeM